AP Liquor Case: చిక్కుల్లో జగన్ కు అత్యంత సన్నిహితడు..! లిక్కర్ స్కామ్‌ కేసులో ఏం జరగబోతోంది?

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కారుమూరి వేసిన ఎత్తుగడ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుందన్న ప్రచారం నడుస్తోంది.

  • Published on- April 22, 2026 / 10:27 PM IST

AP Liquor Case: అంతా చల్లబడ్డట్లే అనిపిస్తుంది. ఆల్‌ ఆఫ్ సడెన్‌గా బిగ్ అప్ డేట్స్‌ సెన్సేషన్‌గా మారుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎప్పుడూ ఏదో ఒక డెవలప్‌మెంట్‌ ట్విస్టులకు దారితీస్తోంది. ఇప్పటికే కీలక నిందితులుగా ఆరోపించబడుతున్న వాళ్లందరికీ బెయిల్‌ రాగా..ఇప్పుడు మరో మాజీ మంత్రికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే సిట్‌ కారుమూరి ఇంటికి నోటీసులు అంటించగా..వాట్‌ నెక్స్ట్ అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఇంకేం జరగబోతోంది?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇప్పటికే పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఆయన క్యాడర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది చాలన్నదట్లుగా లిక్కర్ స్కామ్ కేసు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని..అందులో కారుమూరి కుటుంబం కీలక పాత్ర పోషించిందనేది ప్రధాన ఆరోపణ. కారుమూరి కుమారుడు సునీల్, కోడలు కీర్తి అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారట.

అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కారుమూరి వేసిన ఎత్తుగడ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుందన్న ప్రచారం నడుస్తోంది. సిట్ విచారణాధికారికి ఏకంగా లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి, కేసు నమోదయ్యేలా చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అధికారులనే కొనేయొచ్చనే అతి విశ్వాసం ఇప్పుడు కారుమూరిని చిక్కుల్లో పడేసిందన్న చర్చ జరుగుతోంది.

లిక్కర్ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడు..

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్‌ రవాణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలపై కారుమూరి, ఆయన కుమారుడు సునీల్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. విజయవాడ కమిషనర్‌ ఆఫీస్‌లోని సిట్‌ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని నివాసంలో వారు లేకపోవడంతో అధికారులు ఆ ఇంటి గోడకు నోటీసులు అంటించారు. మద్యం రవాణా చేసే కాంట్రాక్టులో రూ.200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సీఐడీ గత నెలలో కేసు నమోదు చేసింది. అయితే జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కారుమూరి పేరు లిక్కర్ స్కామ్ కేసులో తెరమీదకు రావడంతో..వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది. అటు తణుకు వైసీపీ క్యాడర్ ఇదే సమయమని కారుమూరిపై ఉన్న అసంతృప్తిని బయటపెడుతున్నారట.

ఒకప్పుడు తణుకు నియోజకవర్గంలో కారుమూరి మాటే శాసనం. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. ప్రజల సమస్యల సంగతి దేవుడెరుగు..కనీసం క్యాడర్‌కు కూడా ఆయన అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవాల్సింది పోయి, తాను కేసుల నుంచి ఎలా బయటపడాలన్నదానిపైనే కారుమూరి ఫోకస్ పెట్టారని క్యాడర్ రగిలిపోతోందట.

కార్యకర్తలను పట్టించుకోలేదని క్యాడర్ సీరియస్..

అధికారంలో ఉన్నప్పుడు తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారని, కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోలేదని ఇప్పుడు క్యాడర్ మండిపడుతోంది. ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేక పార్టీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారని ఇన్‌సైడ్ టాక్. మరోవైపు అధికార కూటమి నేతలు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవడం లేదు. ఇసుక, మద్యం అక్రమాలు అంటూ కారుమూరి టార్గెట్‌లో సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

Also Read: పిఠాపురంలో వర్మ వర్సెస్ దొరబాబు.. ఇంతకు ఆ ఇద్దరి ఫైట్‌ ఎందుకు? అసలు ఎజెండా వేరేనా?