Tdp Mahanadu: సిక్కోలు టు సింహపురి.. మహానాడు వేదిక ఎందుకు మారింది? కారణం అదేనా?
ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే జిల్లా శ్రీకాకుళం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా నేతలకు పెద్దపీట వేస్తుంటారు ఆ పార్టీ అధినేతలు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లా ఇది.
- Naveen
- Updated on- May 10, 2026 / 12:58 AM IST
Tdp Mahanadu: పార్టీ ఆవిర్భావ వేడుక. మహానాడు అన్నా..పసుపు పండుగ అని పిలిచినా..ఆ మూడు రోజుల వేడుక మాత్రం తెలుగు తమ్ముళ్లకు ఫెస్టివల్ లాంటిది. తమ సొంతింటి కార్యక్రమంగా ఫీల్ అవుతుంటారు టీడీపీ కార్యకర్తలు. అలాంటి మహానాడును ఈ సారి సిక్కోలు వేదికగా..ఉత్తరాంధ్ర దద్దరిలిపోయేలా నిర్వహించాలనుకున్నారు. స్థలం ఫిక్స్ అయింది. ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడమే లేటు అన్నట్లుగా నడిచింది కథ. కట్ చేస్తే ఓవర్ టు నెల్లూరు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మహానాడు వేదిక సిక్కోలు నుంచి నెల్లూరుకు మారింది అందుకేనా? శ్రీకాకుళం టీడీపీ క్యాడర్‌లో జరుగుతున్న చర్చేంటి.?
పసుపు పండుగ అంటే ఆ పార్టీ నేతలందరికి ఇంటి పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మహానాడు జరిపినా తమ సొంత ఇంటి కార్యక్రమంగానే భావిస్తుంటారు టీడీపీ క్యాడర్. అలాంటి పసుపు పండుగ జరిపే అవకాశం ఈ సారి మొదట సిక్కోలు గడప తొక్కింది. రాక రాక జిల్లాకు ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి..మహానాడును నెల్లూరుకు ఎందుకు తరలించారంటూ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారట. అయితే పసుపు పండుగ నెల్లూరుకు షిఫ్ట్ కావడం వెనుక సిక్కోలు టీడీపీలో ఇంటర్నల్‌గా పెద్ద కథే నడిచిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే జిల్లా శ్రీకాకుళం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా నేతలకు పెద్దపీట వేస్తుంటారు ఆ పార్టీ అధినేతలు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లా ఇది. స్వయంగా ఎన్టీఆరే శ్రీకాకుళం జిల్లా నుంచి బరిలోకి దిగి గెలిచారంటూ తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా సిక్కోలు వాసులు టీడీపీకి బ్రహ్మరథం పట్టడంతో క్లీన్ స్వీప్ చేశారు. దీంతో టీడీపీ అధినేత కూడా కింజరాపు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రి వర్గంలో..రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఇక క్యాడర్‌తో సమావేశంలో భాగంగా జిల్లాలో ఈ సంవత్సరం టీడీపీ పసుపు పండగ మహానాడు సిక్కోలులోనే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్.
క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మహానాడు వేదిక చేంజ్..
ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలోనే టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు చేయాలంటూ లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పెద్దలు, జిల్లా ఇంచార్జ్ మంత్రితో సహా టీడీపీ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. మహానాడుకు అనువైన స్థలాల కోసం జల్లెడ పట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమవరంతో పాటు శ్రీకాకుళం పట్టణంలోని చాపురం, పాత్రునివలస వంటి ప్రాంతాల్లో పర్యటించి అనువైన స్థలాలు ఎంపిక చేశారు. వాస్తు సిద్దాంతులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పనులు షూరూ చేయండని అధిష్టానం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. జిల్లాలో మహానాడు జరుగుతుందంటూ తెలుగు తమ్ముళ్లు సైతం ఖుస్ అయ్యారు. సీన్ కట్ చేస్తే క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మహానాడు వేదిక శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరుకు మారిపోయింది. దీంతో సిక్కోలు టీడీపీ క్యాడర్ అంతా షాక్ అయిపోయిన పరిస్థితి.
మహానాడు వేదిక మార్పునకు సిక్కోలు టీడీపీ నేతల తీరే కారణమన్న చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఉందని..ఆ కార్యక్రమాన్ని కూడా పెద్దఎత్తున నిర్వహించే ప్లాన్ ఉండటంతోనే మహానాడు వేదికను మార్చినట్లు పైకి చెబుతూ వస్తున్నారు నేతలు. కానీ అసలు కారణం వేరే ఉందంటూ గుసగుసలు మొదలయ్యాయి. మహానాడు నిర్వహణ, ఏర్పాట్లు కోసం ఇనీషియేషన్ తీసుకోవాల్సిన సిక్కోలు టీడీపీ ముఖ్యనేతలు అధిష్టానం ఆశించినంత ఉత్సాహం చూపించలేదట. పసుపు పండుగ అంటే దాదాపు 20 రోజులు అక్కడే మకాం వేయాలి. అతిథులకు వసతి ఏర్పాట్లు, పసందైన వంటకాలు వడ్డించడం వంటివి చాలా రిస్క్. ఈ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి మహానాడు నిర్వహణకు అరేంజ్‌మెంట్స్ చేసేందుకు కీలక నేతలెవరూ ముందుకు రాలేదన్నది ఇన్‌సైడ్ టాక్.
శ్రీకాకుళం నేతలను నమ్ముకుంటే సీన్ సితారైపోతుందని..!
ఏదో లోకేశ్ నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ..స్థల పరిశీలన అంటూ హడావుడి చేశారే తప్ప..లీడర్లలో సీరియస్‌నెస్ కనిపించలేదట. దీంతో శ్రీకాకుళం నేతలను నమ్ముకుంటే..సీన్ సితారైపోతుందని భావించిన పార్టీ పెద్దలు..వెంటనే మహానాడు వేదికను మార్చేశారట. పసుపు పండుగ నిర్వహణకు ఆసక్తిగా ఉన్న సింహాపురి నేతలు మహానాడు బాధ్యతలను భుజాన వేసుకున్నారట. ఇప్పటికే ఏర్పాట్లకు శంకుస్థాపన చేసి..పనులను స్పీడప్ చేశారు. అయితే రాకరాక అవకాశం దక్కితే మహానాడు వేదిక మరో చోటుకు తరలిపోయేలా చేశారంటూ శ్రీకాకుళం టీడీపీ క్యాడర్ తమ నేతలపై తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత జిల్లాలో మహానాడు వేడుక జరుగుతుందని సంబరపడితే..ఆ ఆనందం ఎంతసేపు మిగలలేదంటూ నిరుత్సాహ పడిపోయారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పదవులు వెలగబెట్టిన అనుభవమున్న నేతలు..మహానాడును నిర్వహించలేకపోయారా.? అంటూ పెదవి విరుస్తున్నారట.
Also Read: విజయ్‌కి 3 రోజుల డెడ్‌లైన్.. ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్
