Roja Future: జగనన్నకు రోజా గుడ్ బై? లేడీ ఫైర్ బ్రాండ్ రాజకీయ అడుగులు ఎటువైపు?
2024లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఒక వర్గం పట్టుబట్టింది. ఎన్నికల నాటికి గ్రూప్ వార్ పెరిగిపోయి..ఇంకోవైపు కూటమి ఊపులో భాగంగా ఆమె ఓడిపోయారు.
- Naveen
- Updated on- April 15, 2026 / 09:41 PM IST
- ఏపీ వైసీపీలో యాక్టీవ్‌గా ఉంటున్న రోజా..
- తమిళనాడులో డీఎంకే అభ్యర్థి తరఫున ప్రచారం
- రోజా తమిళ పాలిటిక్స్‌లోకి వెళ్తారంటూ టాక్
- రోజా వైసీపీని వీడుతారన్న ప్రచారం వెనుకున్నదెవరు?
Roja Future: ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్ లీడర్. పార్టీ అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..వాయిస్ రేజ్ చేస్తూ పబ్లిక్‌లోనే ఉంటారామె. కానీ పక్క స్టేట్‌లో సినీ, రాజకీయ పరిచయాలు, సొంత నియోజకవర్గంలో ఉన్న కుంపట్లు..ఆమె పొలిటికల్ ఫ్యూచర్‌పై ఎప్పటికప్పుడు సరికొత్తగా చర్చకు దారితీసేలా చేస్తున్నాయి. పక్క రాష్ట్రంలో ఓ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆమె చేసిన ప్రచారం..గాసిప్స్‌కు తెరదీసింది. ఆ లేడీ ఫైర్ బ్రాండ్ చెన్నైకి షిఫ్ట్ కానున్నారా? ఆమె ఏపీ పాలిటిక్స్‌ను వీడుతారన్న ప్రచారం వెనుకున్నదెవరు? రోజా నిజంగానే ప్లాన్ బి ఆలోచనలో ఉన్నారా?
ఫైర్ బ్రాండ్ లేడీగా పేరున్న ఆర్కే రోజా..ఏపీ పాలిటిక్స్‌లో..మరీ ముఖ్యంగా వైసీపీ ఫుల్ యాక్టీవ్ రోల్ ప్లే చేస్తున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోయినప్పటికీ అపోజిషన్ వాయిస్ బలంగా వినిపిస్తున్న వాళ్లలో ఆమె ఒకరు. అయితే లేటెస్ట్‌గా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థికి మద్దతుగా రోజా ప్రచారం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న వైసీపీ పార్టీకి చెందిన రోజా..ఇండియా కూటమిలో పైగా కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే డీఎంకే పార్టీ క్యాండిడేట్‌కు క్యాంపెయిన్ చేయడం ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. అయితే రోజా అక్కడ ప్రచారం చేయడంపై వైసీపీ మాత్రం రియాక్ట్ కావడం లేదు. మరోవైపు ఆమె ఏపీ పాలిటిక్స్‌ను వదిలేసి..తమిళనాడుకు షిఫ్ట్ అవుతారంటూ ప్రచారం ఊపందుకుంది.
వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి టికెట్ దక్కడం డౌటే?
ఏడాదిన్నర క్రితమే మొదలైన ఈ ప్రచారం పూర్తి అసత్యమంటూ రోజా స్పష్టం చేస్తున్నా, ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అంటూ చక్కర్లు కొడుతున్న గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి టికెట్ దక్కడం అనుమానమేనని, నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి క్యాడర్ ఆమెను వ్యతిరేకిస్తోందని కొద్ది రోజులుగా పెద్దఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం కూడా ఆమెకు టికెట్ ఇవ్వనంటోందని, దీంతో రోజా ఏపీ రాజకీయాలను వదిలేసి ఆమె తమిళనాడు పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. అయితే రోజా భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వ్యక్తి. సినీ దర్శకుడు..ఆయనకు అక్కడ సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. రోజాకు సినీ నటిగా తమిళనాడులో అంతో ఇంతో గుర్తింపు ఉందంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అటువైపు షిప్ట్ అవుతున్నారన్న టాక్ మొదలుపెట్టారని అంటున్నారు.
రోజా టార్గెట్‌గా సాగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. అయితే 2024 ఎన్నికలకు ముందే రోజా తీరుపై నగరి వైసీపీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలైంది. 2024లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఒక వర్గం పట్టుబట్టింది. ఎన్నికల నాటికి గ్రూప్ వార్ పెరిగిపోయి..ఇంకోవైపు కూటమి ఊపులో భాగంగా ఆమె ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల తర్వాత నగరిలో రోజాకు చెక్ పెట్టే ప్రయత్నాలు జోరు అందుకున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. నగరిలో కొత్త ఇంచార్జిని తీసుకొచ్చి పార్టీని పటిష్టం చేసేందుకు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
వైసీపీలో గాలి జగదీష్ చేరికకు లైన్ క్లియర్..!
గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు జగదీష్ వైసీపీలో చేరికకు ఎప్పుడో లైన్ క్లియర్ అయిందని..రోజా పట్టుబట్టి ఆయన రాకను ఆపుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఆరు నెలల క్రితం గాలి జగదీష్ వైసీపీలో చేరేందుకు తన అనుచరులతో కలిసి బయలుదేరి మధ్యలోనే ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. అప్పుడు అయితే గాలి జగదీశ్ చేరికను అడ్డుకోగలిగిన రోజా..రాబోయే రోజుల్లో తన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదోనన్న డైలమాలో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే 2029లో ఆమె నగరి టికెట్ ఇవ్వరన్న టాక్ ఊపందుకుంది. పార్టీ పవర్‌లోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని చెబుతున్నారని అంటున్నారు. రోజా మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని..పట్టుబడుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో గాలి జగదీష్‌ను చేరికను ఒప్పుకునే ప్రసక్తే లేదని మొండికేస్తున్నారట. దాంతో వైసీపీ పెద్దలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
ఇలా నగరిలో పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతోనే..రోజా ప్లాన్ బీతో ముందుకు వెళ్తున్నారని టాక్. స్టాలిన్ కుటుంబంతో రోజా ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ వైసీపీ తనకు టికెట్ ఇవ్వకపోతే తమిళనాడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారనేది ఓ చర్చ.
రోజా ఏపీ పాలిటిక్స్‌ను, వైసీపీని వీడే ముచ్చటే లేదు..!
రోజా అనుచరులు మాత్రం ఇదంతా ఉట్టి ప్రచారమేనని కొట్టి పారేస్తున్నారు. రోజా ఓ డీఎంకే అభ్యర్థితో ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనే ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారని..ఆమెకు తమిళ్ పాలిటిక్స్‌లోకి వెళ్లే ఆలోచనే లేదంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం చేశారని..తమ నాయకురాలిని నేరుగా ఢీకొట్టే సత్తా లేక ఇటు ఇంటా, అటు బయటా అందరూ కలిసి కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక నగరికి చెందిన సొంత పార్టీ నేతలతో పాటు..వైసీపీలో చేరాలనుకుంటున్న నేతల హస్తం ఉండొచ్చన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. గిట్టని వారు స్ప్రెడ్ చేస్తున్న గాలి వార్తలే తప్ప..రోజా ఏపీ పాలిటిక్స్‌ను, వైసీపీని వీడే ముచ్చటే లేదంటున్నారు. రాబోయే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసేది రోజానేని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె అనుచరులు.
