×
Ad

Ys Jagan: అసెంబ్లీకి జగన్.. వైసీపీ వ్యూహం ఏంటి? అసలు ప్లాన్ అదేనా?

వైసీపీ సభ్యులను సభకు రప్పించేందుకు అధికార పక్షం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అనర్హత వేటు..జీత భత్యాలు కట్ అంటూ స్పీకర్ పదేపదే వైసీపీని కార్నర్ చేస్తున్నారు.

  • Published On : February 10, 2026 / 08:37 PM IST

Ys Jagan Representative Image (Image Credit To Original Source)

  • అసెంబ్లీ సమావేశాల వేళ ఇంట్రెస్టింగ్ డిస్కషన్
  • బడ్జెట్‌ సెషన్‌ మొత్తం వైసీపీ సభకు అటెండ్ అవుతుందా?
  • విపక్షంలోకి వచ్చాక సభలో చర్చలో పాల్గొనని జగన్
  • ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్న వైసీపీ

Ys Jagan: ఎట్టకేలకు అసెంబ్లీకి వైసీపీ. 10 మంది సభ్యులతో సహా సభకు జగన్. వైసీపీ అసెంబ్లీకి అటెండ్‌ అవడం వెనుక ప్లాన్ ఏంటి? ఎప్పటిలాగే ఒక్క రోజే సభలో కనిపించి..ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడబోరా? వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం వెనుక వ్యూహం ఏంటి? అనర్హత నుంచి తప్పించుకోడానికే ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేస్తుందా? లేక పొలిటికల్ వ్యూహం ఏమైనా ఉందా? అనర్హత అంటూ కూటమి పార్టీలు చేస్తున్న కామెంట్స్‌కి చెక్ పెట్టడానికే వన్‌ డే అటెండెన్స్‌కు స్కెచ్ వేశారా? ప్రతిపక్ష హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చేందుకేనా?

వైసీపీ తగ్గడం లేదు. కూటమి మెట్టు దిగడం లేదు. ప్రతిపక్ష హోదా కోసం ఫ్యాన్ పార్టీ..నిబంధనలు ఒప్పుకోవంటూ కూటమి..అసెంబ్లీ సమావేశాల చుట్టూ 20 నెలలుగా ఇదే రచ్చ నడుస్తోంది. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌ నడిచేలా కనిపిస్తున్నాయి సిచ్యువేషన్‌. బడ్జెట్‌తో పాటు వివిధ అంశాలపై చర్చలు, కొత్త బిల్లులు, సవరణలు అంటూ దాదాపు 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల వేళ ఎప్పటిలానే ఈసారి వైసీపీ అసెంబ్లీకి వస్తుందా అనే చర్చ మొదలైంది. ఈసారి అసెంబ్లీకి వైసీపీ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

బడ్జెట్‌ సెషన్‌లో ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో కనిపించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశాలకు మాత్రమే వెళ్లిన వైసీపీ ప్రమాణస్వీకారం చేసి వచ్చేశారు. తర్వాత జరిగిన సమావేశాలకు వైసీపీ మొదటిరోజు వెళ్లి బాయ్ కట్ చేస్తున్నారు. ఇందుకు కారణం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే అంటున్నారు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీకి వెళ్లి ఏం ఉపయోగం?

ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ప్రజల గురించి మాట్లాడే అవకాశం సమయం ఉండదు కనుక వెళ్లి ఏమి ఉపయోగం అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. సంఖ్యాబలం తక్కువ ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఒక్కటే ఉంది కాబట్టి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హోదా ఇచ్చేవరకూ అసెంబ్లీకి వెళ్లమని తెగేసి చెప్తున్నారు వైసీపీ సభ్యులు. ఈ అంశం స్పీకర్ దగ్గర పెండింగ్‌లో ఉండటమే కాకుండా హైకోర్టులోనూ వైసీపీ పిటిషన్ వేసింది.

గవర్నర్ సమక్షంలోనే హోదా కోసం డిమాండ్?

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మాత్రమే సభకు హాజరై వచ్చేస్తున్నారు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. అది కూడా బడ్జెట్ సమావేశాలకు మాత్రమే వెళ్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అటెండ్‌ అయి గవర్నర్ ముందే హోదా గురించి డిమాండ్ చేస్తుంది వైసీపీ. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బడ్జెట్ సమావేశాల మొదటిరోజు గవర్నర్ ప్రసంగం సమయంలో..గవర్నర్ సమక్షంలోనే హోదా కోసం డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఫ్యాన్ పార్టీ. గవర్నర్ ప్రసంగం తర్వాత..వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు జగన్. ఈసారి కూడా ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభకు అటెండ్‌ కానుందని తెలుస్తోంది. మండలిలో మాత్రం రెగ్యులర్‌గా చర్చల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు.

అనర్హత వేటు.. జీత భత్యాలు కట్..!

వైసీపీ సభ్యులను సభకు రప్పించేందుకు అధికార పక్షం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అనర్హత వేటు..జీత భత్యాలు కట్ అంటూ స్పీకర్ పదేపదే వైసీపీని కార్నర్ చేస్తున్నారు. సభకు వరుసగా 60 రోజులు గైర్హాజరైతే అసెంబ్లీ సభ్యత్వం రద్దైపోతుందని ఒకసారి, సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని మరోసారి ప్రచారం చేయడం ద్వారా వైసీపీ సభ్యులపై అధికార కూటమి ఒత్తిడి పెంచినట్లు అయిందంటున్నారు.

బడ్జెట్ సెషన్ మొదటి రోజు సభకు హాజరుకావాలని మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులో భాగమేనంటూ అధికార పార్టీ నేతలు అటాక్ చేస్తున్నారు. కారణం ఏదైనా అసెంబ్లీకి జగన్ హాజరవుతుండటమే పొలిటికల్‌ హీట్‌ను పెంచేస్తోంది. జగన్ బడ్జెట్ సెషన్‌ మొత్తం అసెంబ్లీకి హాజరైతే సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయని అంటున్నారు.

జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై చర్చకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ విషయంలో ఎవరు ఏం చెప్పినా ప్రజలకు సరైన మెసేజ్ వెళ్తుందని అంచనా వేస్తున్నారు. స్పీకర్ తరచూ చేస్తున్న అనర్హత వేటు వ్యాఖ్యల నేపథ్యంలోనే వైసీపీ సభ్యులు ఒక్కరోజు అసెంబ్లీకి హాజరవుతున్నారని విమర్శలు చేస్తున్నాయి కూటమి పార్టీలు. వైసీపీ మాత్రం ప్రతిపక్ష పార్టీగా హోదా తమ హక్కు సాధించేదుకే గవర్నర్ ముందు మరోసారి డిమాండ్ చేస్తామంటున్నారు.

Also Read: కూటమి పాలనలో కమ్మతనం పోవాలి..! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?