Janasena Rajya Sabha Race: లింగమనేనా? నాగబాబా? పెద్దల సభకు పవన్ ఎవరిని పంపిస్తారు..
ఈ ఒక్క స్థానం కోసం ఆశావహులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రేసులో కొందరి పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయ్.
- Naveen
- Published on- May 29, 2026 / 08:16 PM IST
Janasena Rajya Sabha Race: జనసేనలో రాజ్యసభ సందడి కనిపిస్తోంది. మరి పార్టీ అధినేత ఆలోచన ఏంటి.. కూటమిలో భాగంగా జనసేనకు ఒక్క స్థానం రాబోతుండగా.. అది ఎవరికి ఇవ్వబోతున్నారు.. జనసేన సభ్యుడిగా మొదటిసారి రాజ్యసభలోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారు? సొంత వాళ్లకా, పార్టీలో ఉన్నవాళ్లకా, లేదంటే పార్టీకి అండదండలు అందిస్తున్న వారికా.. అవకాశం దక్కబోయేది ఎవరికి.. ఇంతకీ పవన్ మనసులో ఉన్న పేరు ఏంటి..
పెద్దల సభకు పవన్ ఎవరిని పంపిస్తారు..?
ఏపీలో రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. నాలుగు స్థానాలకు ఎన్నిక జరగబోతుంది. ఇవన్నీ కూటమి పార్టీలకు దక్కబోతున్నాయ్. ఐతే పొత్తులో భాగంగా వీటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. జనసేన తరఫున మొదటిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టబోయేది ఎవరు.. అవకాశం ఎవరికి దక్కబోతోందనే చర్చ పార్టీలో జరుగుతోంది. జనసేనకు ఇది మొట్టమొదటి స్థానం కావడంతో.. పెద్దల సభకు పవన్ ఎవరిని పంపిస్తారు.. ఎలాంటి సమీకరణాలు లెక్కలోకి తీసుకుంటారనే ఆసక్తి పార్టీ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ కనిపిస్తోంది.
చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌కు సన్నిహితులు..
రాజ్యసభ స్థానం విషయంలో పవన్ కల్యాణ్ భారీగా కసరత్తు చేస్తున్నారు. ఇక అటు ఈ ఒక్క స్థానం కోసం ఆశావహులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక అటు రేసులో కొందరి పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయ్. ఆ లిస్టులో మొదటిగా వినిపిస్తున్న పేరు.. లింగమనేని రమేష్. పవన్‌తో పాటు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌కు ఆయన అత్యంత సన్నిహితులు. పైగా కష్టకాలంలో పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఇవి లింగమనేని రమేష్‌కు కలిసి వచ్చే అంశాలు. జనసేనకు రాజ్యసభ అవకాశం ఎప్పుడు వచ్చినా.. లింగమనేని రమేష్‌కి ఇస్తారనే పార్టీలో దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. ఇక ఆయన కూడా చాలాకాలంగా ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. పవన్ కూడా లింగమనేనికే దాదాపు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నాగబాబు ఎమ్మెల్సీ స్థానం బాలినేనికి?
ఇక అటు లింగమనేనితో పాటు.. మరికొందరు కూడా రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా నాగబాబు పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. ఎంపీగా వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. గతంలో రాజ్యసభ స్థానాల ఎంపిక విషయంలో నాగబాబు పేరు వచ్చినా అది టీడీపీకి కేటాయించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా సరిపెట్టుకున్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ స్థానం త్యాగం చేయడం.. మంత్రి పదవి కూడా రాకపోవడంతో.. రాజ్యసభకు వెళ్లాలన్న కోరిక అయినా తీర్చుకోవాలని నాగబాబు అనుకుంటున్నారట. ఆయనకు కానీ రాజ్యసభ స్థానం దక్కితే.. నాగబాబు ఎమ్మెల్సీ స్థానాన్ని బాలినేనికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయ్. నిజానికి బాలినేని కూడా చాలాకాలంగా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. నాగబాబును రాజ్యసభ పంపిస్తే ఇద్దరికీ అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
రాజ్యసభ స్థానం కోసం AM రత్నం ప్రయత్నం!
ఈ ఇద్దరితో పాటు.. మరికొందరు పారిశ్రామికవేత్తలు, పార్టీలోనే ఉన్న సీనియర్ నిర్మాత AM రత్నం కూడా రాజ్యసభ స్థానం కోసం పవన్ దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారట. ఐతే పవన్ మాత్రం.. పార్టీకి చాలా కాలంగా అండదండలు అందిస్తున్న లింగమనేని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన పేరే ఫైనల్ అవుతుందా.. ట్విస్టులు కనిపిస్తాయా.. రాజకీయ సమీకరణాలు మారతాయా అనేది చూడాలి.
Also Read: ఏకగ్రీవమైందా.. పోస్టులు గోవిందా! ఇంచార్జిలకు జగన్ హెచ్చరికల వెనుక కారణాలేంటి?
