Ys Sharmila: పెద్దల సభకు షర్మిల? ఇందులో నిజమెంత, కర్ణాటక నుంచే ఎందుకు?

తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో పార్టీ అధికారంలో ఉండటంతో.. దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీపై ఆ పార్టీ ఫోకస్ చేసేందుకు రెడీ అయింది.

  • Updated on- May 30, 2026 / 09:52 PM IST
  • షర్మిలకు రాజ్యసభ సీటు అంటూ ప్రచారం..
  • కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపుతారని టాక్‌!
  • షర్మిలకు రాజ్యసభ సీటు ప్రచారంలో నిజం ఎంత?
  • కర్ణాటక నుంచే పంపిస్తారనే ప్రచారం ఎందుకు ?
  • అసలు కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఏముంది?

Ys Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు.. రాజ్యసభ సీటు ఇస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. కర్ణాటక నుంచి ఆమెను పెద్దల సభకు పంపుతారంటూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సరిగ్గా రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు ముందు.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీని ష‌ర్మిల క‌ల‌వ‌డంతో.. ఈ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఏది నిజం.. షర్మిలను నిజంగా రాజ్యసభకు పంపిస్తారా.. అదే నిజమైతే కర్ణాటక నుంచే ఎందుకు.. అసలు హస్తం పార్టీ వ్యూహాలు ఏంటి..

దక్షిణాది కాంగ్రెస్ రాజకీయాల్లో.. ఒక ఆసక్తికరమైన సమీకరణ తెరపైకి వచ్చింది. ఏపీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు అంటూ జరుగుతున్న ప్రచారం.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక అటు షర్మిల కూడా.. పార్లమెంట్‌లో అడుగుపెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని టాక్‌. దీని కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటకను ఆమె వేదికగా ఎంచుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ముందుగా వైఎస్ఆర్‌టీపీ పేరుతో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల.. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ సమయంలో అధిష్టానం తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రాజ్యసభ బెర్త్ కోసం షర్మిల తన ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లిన ఆమె.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి చర్చించారు. దీంతో షర్మిలకు రాజ్యసభ అవకాశం అనే ప్రచారం మరింత బలంగా వినిపిస్తోంది.

ఏపీ నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తే మంచి సంకేతాలు..

ఓవైపు షర్మిల ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో పాజిటివ్‌గానే ఉందనేది మరికొందరి నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ఏపీలో పార్టీని స్ట్రాంగ్ చేసే అంశంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో పార్టీ అధికారంలో ఉండటంతో.. దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీపై ఆ పార్టీ ఫోకస్ చేసేందుకు రెడీ అయింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో.. ఏపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని చురుకుగా పనిచేసేలా.. పార్టీ ప్రస్తుత కార్యకర్తల్లో ఓ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. దీంతో షర్మిలకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తన్నాయ్‌. అధిష్టానం దృష్టిలో కేవీపీ, రఘువీరా లాంటి నేతలు ఉన్నా.. షర్మిలవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని హస్తిన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు నోటిఫికేషన్‌..

ప్రస్తుతం కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. అందులో ఒకటి బీజేపీకీ వెళ్లిపోతే.. మూడు స్థానాలు హస్తం పార్టీకి దక్కుతాయ్‌. ఈ మూడింట్లో ఒకటి ఖర్గేకు ఖాయం. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఏపీకి ఇవ్వాలనే ఆలోచనతో ఉందట కాంగ్రెస్ హైకమాండ్‌. జూన్ 8 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో.. అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్‌లో తీవ్ర కసరత్తు జరుగుతోంది. దీంతో షర్మిల కూడా తన వైపు నుంచి పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. పార్టీ పెద్దలతో వరుస భేటీల వెనక అసలు కారణం కూడా అదే అనే చర్చ జరుగుతోంది. ఇక అటు కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య కూడా.. తనకు రాజ్యసభకు వెళ్లే ఉద్దేశం లేదని క్లియర్‌ కట్‌గా చెప్పేశారు. ఇది షర్మిలకు మరింత అనుకూలంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. ఇక అటు డీకేతో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉండడం కూడా షర్మిలకు ప్లస్ అయ్యే చాన్స్ ఉంది.

సౌత్ సెంటిమెంట్‌కు పెద్ద పీట?

ఏపీలో పార్టీ పటిష్టం.. భవిష్యత్ కార్యాచరణ అనే కారణాలు చెప్తూ షర్మిల హస్తిన పర్యటనకు వెళ్లినా.. అసలు కారణం మాత్రం రాజ్యసభ అవకాశం కోసం ప్రయత్నాలే అనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మరి షర్మిలకు అవకాశం దక్కుతుందా.. జాతీయస్థాయి నేతలను పక్కనపెట్టి ఆమెకు అవకాశం కల్పిస్తారా.. లేదంటే సౌత్ సెంటిమెంట్‌కు పెద్ద పీట వేస్తారా.. కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఏముంది.. షర్మిలకు చాన్స్‌ దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. ఐతే షర్మిలకు కానీ అవకాశం ఇస్తే.. ఏపీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లు అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మరి ఈ దిశగా పార్టీ పెద్దలు ఆలోచిస్తారా లేదో చూడాలి.

Also Read: టార్గెట్ తెలంగాణ..! తెలంగాణ రాజకీయాలపై పవన్ దృష్టి సారించారా? జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయనున్నారు?