Ys Jagan Warning: ఏకగ్రీవమైందా.. పోస్టులు గోవిందా! ఇంచార్జిలకు జగన్ హెచ్చరికల వెనుక కారణాలేంటి?

ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయ్‌. స్థానిక సమరం మొదలైతే.. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

  • Updated on- May 29, 2026 / 12:50 AM IST
  • గెలవనీ, ఓడనీ.. పోటీలో ఉండాల్సిందే!
  • ఏకగ్రీవాలు అయితే ఊరుకునేది లేదు..
  • నియోజకవర్గం ఇంచార్జిలకు జగన్‌ వార్నింగ్‌..
  • ఇంచార్జిలకు అసలు పరీక్ష ఇక అప్పుడేనా?

Ys Jagan Warning: గెలవనీ.. ఓడనీ.. ఫలితం ఎలా అయినా ఉండనీ.. పోటీలో మాత్రం ఉండాల్సిందే ! ఏకగ్రీవం అయిందా ఊరుకోను. పోటీలో ఉండండి పోరాడండి. ఎక్కడైనా ఏకగ్రీవం అయిందా.. పోస్టులు ఊస్టు అయిపోతాయ్‌ జాగ్రత్త. ఇదీ నియోజకవర్గ ఇంచార్జిలకు జగన్ ఇచ్చిన వార్నింగ్‌.. ఈ రేంజ్‌లో అసలు వైసీపీ అధినేత హెచ్చరికలు ఎందుకు ఇచ్చినట్లు.. అసలు కారణాలు ఏంటి.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది..

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయ్‌. ఈ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని అటు అధికార కూటమి పార్టీలు.. ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయ్‌. ఎలాగైనా సరే.. స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయ్‌. స్థానిక ఎన్నికలను వైసీపీ మరింత సీరియస్‌గా తీసుకుంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. గ్రౌండ్ లెవల్‌ కేడర్‌లో స్థైర్యం నింపాలన్నా.. జోష్‌ తీసుకురావాలన్నా.. లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాల్సిందే అని ఫిక్స్ అయింది. దీనికోసం పార్టీ నేతలు, కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు అధినేత జగన్‌. రెడీగా ఉండడం కాదు.. ఎక్కువ స్థానాలు గెలిచి తీరాల్సిందేనని టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తున్నారు.

రెండేళ్లు అవుతున్నా.. అందుబాటులో ఉండటం లేదని అసంతృప్తి..

వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో..స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నియోజకవర్గ ఇంచార్జిలకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు జగన్‌. ఎన్నికలు అయిపోయి రెండేళ్లయినా.. కొందరు నేతలు నియోజకవర్గాలకు అందుబాటులో ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో.. 34 మంది చోట్ల అసలు ఇంచార్జిలు అందుబాటులో ఉండటం లేదని ఫైర్ అయ్యారు. వీళ్లంతా పద్దతి మార్చుకోవాలని సూచించిన జగన్.. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ మీద పైచేయి సాధించాలని.. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ వేసే వారికి.. ఇంచార్జిలు అన్ని రకాలుగా సపోర్టు అందించాలని.. పోటీ చేయకుండా ఏకగ్రీవం అయితే.. ఇంచార్జి వైఫల్యంగానే పరిగణనలోకి తీసుకుంటానని హెచ్చరించారు జగన్‌.

గెలిచినా, ఓడినా.. పోటీ మాత్రం చెయ్యాల్సిందే..

ఏపీలో ఈసారి స్థానిక ఎన్నికలు హాట్‌హాట్‌గా జరిగే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయ్‌. స్థానిక సమరం మొదలైతే.. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఐతే స్థానిక ఎన్నికలు అంటే.. అధికార పార్టీకి ఫేవర్‌గానే ఉంటాయ్‌. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకే ఎక్కువ స్థానాలు దక్కుతాయ్‌. ఏకగ్రీవాలు కూడా భారీగా కనిపిస్తుంటాయ్‌. ఐతే అలాంటి పరిస్థితి వస్తే కుదరదని తెగేసి చెప్తున్నారు జగన్‌.. గెలిచినా ఓడినా.. పోటీ మాత్రం చెయ్యాల్సిందేనని క్లియర్‌ కట్‌గా ఇంచార్జిలను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పుడు నేతలు బలంగా నిలిస్తే.. సాధారణ ఎన్నికల్లో నేతల కోసం కేడర్‌ బలంగా నిలుస్తుందని అంటున్నారు. జగన్ చేసిన సూచనలు.. ఇచ్చిన వార్నింగ్‌లు.. ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్‌.

అటు జూన్‌ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు జగన్ పిలుపునిచ్చారు. మండల కేంద్రాలతో పాటు.. నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలు, ర్యాలీల్లో ఇంచార్జిలు పాల్గొనాలని జగన్ సూచించారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా ప్రాంతాల్లో ఇంచార్జిలు సైలెంట్‌ మోడ్‌లో ఉన్నారు.. ఐతే ఇప్పుడు వాళ్లంతా యాక్టివ్‌ అవాల్సిందే. మరి వాళ్లు అవుతారా.. అవకపోతే జగన్ తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.