AP Gramakantam Lands : ఏపీ వాసులకు శుభవార్త.. ఆ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. రికార్డులు, పత్రాలు అవసరం లేదు..!

AP Gramakantam Lands : ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని ఎందరికో దీర్ఘకాలిక సమస్య నుంచి ఊరట లభించనుంది.

gramakantam lands in andhra pradesh can be legally registered

  • ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
  • గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కి లైన్ క్లియర్
  • లింక్ డాక్యుమెంట్లు లేకున్నా సరే

AP Gramakantam Lands : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు ఆమోదముద్ర వేసింది. పైగా ఎలాంటి లింక్ దస్తావేజులు, రికార్డులు లేకున్నా.. కేవలం ఇంటి పన్ను రశీదును అంగీకరించి.. వాటిని రిజిస్టర్ చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎందరికో ఊరట లభించనుంది. వీటి ప్రకారం గ్రామ కంఠాల్లోని ఇళ్లు, వారసత్వంగా వచ్చిన భూములు, ఇతర స్థలాలను ఇకపై రిజిస్ట్రేషన్‌‌ చేయించుకోవచ్చు.

అలానే గ్రామ కంఠంలోని భూములు నిషేధ జాబితాలో ఉన్నా సరే.. వాటిల్లో ప్రజలకు ఇళ్లు, నివాస స్థలాలు ఉంటే.. అందుకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించి.. వాటిని రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం లింక్ దస్తావేజులు వంటివి అవసరం లేదని.. కేవలం ఇంటిపన్ను, ఖాళీస్థలం పన్ను రశీదుల్ని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. ఈ క్రమంలోనే కూటమి సర్కార్.. గ్రామకంఠం భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే వెబ్‌లాండ్‌ రికార్డుల్లో గ్రామకంఠం అని నమోదైన సర్వే నంబర్లకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

* సర్కార్ కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన భూముల విలువ.. ఏకంగా 100 శాతం పెంపు.. ఏ ప్రాంతంలో ఎంతంటే

గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలు

  • ప్రజలకు సంబంధించిన ఏదైనా భూమి, ఇంటి స్థలం వంటివి వెబ్‌లాండ్‌ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన సర్వేనంబరులో ఉంటే.. అందుకు సంబంధించిన సర్వే నంబరు నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా.. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాల్సిందే.
  • సదరు ఆస్తి.. గ్రామకంఠం సర్వేనంబరులో భాగమనే లింకు డాక్యుమెంట్లు ఉన్నట్లయితే.. రిజిస్ట్రేషన్‌ అధికారి ఆ పత్రాలను అంగీకరించాల్సిందే.
  • ఒక స్థలంలో ఇల్లు ఉంది. దానికి సంబంధించి ఆ ఇంటి యజమానుల వద్ద ఎలాంటి లింక్‌ దస్తావేజులు లేవు. అలాంటి సమయంలో వాటిని రిజిస్టర్ చేయడానికి స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటిపన్ను రశీదును అంగీకరించాలి.
  • పట్టణ ప్రాంతాల్లో వంశపారంపర్య ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ.. వాటికి లింకు డాక్యుమెంటు లేదు. అలానే ఇంటిపన్ను రశీదులూ కూడా లేవు. అలాంటి సందర్భంలో ఖాళీ స్థల పన్ను రశీదును రిజిస్ట్రేషన్‌ అధికారి అంగీకరించాలి. తగిన ధ్రువీకరణ రికార్డులు (2023 మార్చి 21న జారీ చేసిన సర్క్యులర్‌లోనివి) పరిశీలించి.. ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది.
  • పైన చెప్పిన విధంగానే… గ్రామీణ ప్రాంతాల్లో వంశపారంపర్య ఖాళీ స్థలాలుండి.. వాటికి కూడా లింకు డాక్యుమెంట్లు, ఇంటిపన్ను రశీదు లేకపోతే.. రిజిస్ట్రేషన్‌ చేసే వారి పత్రంలోనే స్వయం ధ్రువీకరణ చేర్చాలి. దీనిలోనే వారసత్వ వివరాలు, ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించడం, 22ఎలో లేదనే విషయాలు వెల్లడించాలి.
  • రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్‌ తెచ్చుకోమని ఒత్తిడి చేయకూడదు. 2026 ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించాలి.

గ్రామంలోని నివాస ప్రాంతాలను గ్రామకంఠం భూములు అంటారు. ప్రభుత్వ, సామాజిక అవసరాలకు కేటాయించిన భూమి తప్ప.. మిగిలిన గ్రామకంఠం భూముల్ని 22ఎ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ 2015లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గ్రామకంఠంగా నమోదైన సర్వేనంబర్లు కూడా.. 22ఎలో ప్రభుత్వ భూమిగా కనిపిస్తున్నాయి. సబ్‌ డివిజన్‌ జరగకపోవడంతో ఆ సర్వేనంబరు మొత్తాన్ని 22ఎలో పెట్టేశారు. పైగా వీటికి సంబంధించిన రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు సరిగా లేనందున రిజిస్ట్రేషన్ కు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.