Land Value Hike : సర్కార్ కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన భూముల విలువ.. ఏకంగా 100 శాతం పెంపు.. ఏ ప్రాంతంలో ఎంతంటే
Land Value Hike : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ విలువను 100 శాతం వరకు పెంచేందుకు రెడీ అవుతోంది.
telangana government will hike land market value upto 100 percent soon
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంపుపై నివేదిక సిద్ధం
- గరిష్టంగా 100 శాతం పెంపుకు ఆమోదం
Land Value Hike : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువ పెంపుపై ఇప్పటికే అధికారులు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ విలువ దాదాపు ఖరారయ్యింది. అయితే ఈ పెంపు గరిష్టంగా 100 శాతానికి మించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు భూముల విలువ పెంపు నివేదికలను సిద్ధం చేశారు.
రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే లావాదేవీల ఆధారంగా ప్రాంతాలను బట్టి భూముల మార్కెట్ విలువను కనిష్ఠంగా 5 శాతం నుంచి 100 శాతం వరకు పెంచుతూ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. మే 28 నుంచి పెరిగిన ఈ కొత్త మార్కెట్ విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు ద్వారా ఈ సంవత్సరం అదనంగా రూ.1000 కోట్ల-రూ.1500 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రాంతాల వారీగా పెంపు ఇలా ఉండనుందా..
తాజా నివేదికల ప్రకారం
- తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి మార్కెట్ కార్డు విలువను కనిష్ఠంగా రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు.
- అదే మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న భూముల విషయానికి వస్తే.. ఎకరా భూమి కనిష్ఠ విలువ రూ.5 లక్షలుగా నిర్ణయించారు.
- ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఎకరా భూమి మార్కెట్ విలువ కనిష్ఠంగా రూ.15 లక్షలుగా నిర్ణయించగా..
- ఓఆర్ఆర్ ఆనుకుని ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ఎకరా భూమి ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించారు.
- ఓఆర్ఆర్ లోపల చదరపు గజం విలువ కనిష్ఠంగా రూ.3500-రూ.4 వేల లోపు ఉండనుందని తెలుస్తోంది.
- అదే విధంగా ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ ధర రూ.3000-రూ.3500 వరకు ఉండబోతుండగా..
- మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2500-రూ.3000 వరకు నిర్ణయించారు.
- గ్రామీణ ప్రాంతాల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2000 వరకు ఉండనుంది.
- ఇదే ఓపెన్ ప్లాట్ల విషయానికి వస్తే.. రాష్ట్రంలోని సుమారు 15-20 శాతం ప్లాట్లకు మార్కెట్ విలువపై వంద శాతం పెంపు వర్తించే అవకాశం ఉంది.
- ఓఆర్ఆర్ లోపల రియల్ ఎస్టేట్ జోరుగా ఉన్నచోట్ల 50 శాతం ప్రాంతాల్లో ఫ్లాట్ల విలువను ఇప్పుడున్న దానికన్నా వంద శాతం పెంచుతున్నట్లు సమాచారం.
