Telangana Rains : వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. వాతావరణ హెచ్చరికలు జారీ
Telangana Rains : వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు
- Harish Thanniru
- Published on- September 21, 2026 / 07:59 AM IST
Telangana Rains
Telangana Rains : ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వారంరోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం కారణంగా నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర అండమాన్ సముద్రంకు ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతోంది. ఇది ఇవాళ సాయంత్రంకు వాయుగుండంగా మారుతుందని, సెప్టెంబర్ 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబర్ 23 నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోని బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 23, 24, 25 తేదీల్లో భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో 24జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాలు, ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
