Heavy Rains
Heavy Rains : ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈమేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఉత్తర -వాయువ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతుంది. విశాఖపట్టణంకు 300 కిలోమీటర్లు, గోపాల్ పూర్ (ఒడిశా)కి 300, పూరికి 330 కిలోమీటర్లు, పారాదీప్ (ఒడిశా)కి 400 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం సాయంత్రం లేదా అర్ధరాత్రి గోపాల్ పూర్ – పారాదీప్ మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Kendriya Vidyalayas: ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ఎక్కడెక్కడ అంటే..
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కికానాడ, తూర్పు గోదారి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపాయి.