Kendriya Vidyalayas: ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ఎక్కడెక్కడ అంటే..
ఏపీకి కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్ర ప్రభుత్వం కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. చిత్తూరు జిల్లా మంగసముద్రం, బైరుగానిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతి శాఖమూరులో కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఏపీకి కొత్త కేంద్రీయ విద్యాలయాల కేటాయింపుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అటు తెలంగాణకు సైతం కేంద్రం 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా చెల్గల్, వనపర్తి జిల్లా నాగవరం శివార్ లో ఇవి ఏర్పాటు కానున్నాయి. తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కొత్త కేంద్రీయ విద్యాలయాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న నాలుగింటితో కలిపి ఈ సంఖ్య 39కి చేరనుంది.
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3శాతం పెంచింది. అలాగే 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసుల కోసం ఆత్మ నిర్భర్ భారత్ కింద 11వేల 440 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశ ఆర్థిక, సంక్షేమ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ క్యాబినెట్. కొత్త డీఏ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. 49.2 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ పెంపు వల్ల డీఆర్ డీఏలు మూల వేతనంలో 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. కీలక భత్యం పెంపుదల వల్ల ఖజనాపై దాదాపు 10వేల 84 కోట్ల రూపాయల భారం పడనుంది.