×
Ad

Botcha Satyanarayana: ఎమ్మెల్సీ బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసులు.. అందులో ఏముందంటే

2 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ 33ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని బొత్స సత్యనారాయణపై మండిపడింది.

  • Published On : February 19, 2026 / 06:00 AM IST

Botcha Satyanarayana Representative Image (Image Credit To Original Source)

  • హెరిటేజ్ సంస్థపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్
  • తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు
  • క్షమాపణ చెప్పాలి, లేదంటే సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు

 

Botcha Satyanarayana: తిరుమల లడ్డూ నెయ్యి వివాదంలో వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. హెరిటేజ్ సంస్థ తరపున లీగల్ నోటీసులు పంపారు న్యాయవాది జి.మల్లిఖార్జున్ రావు. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారని నోటీసుల్లో పేర్కొంది. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

హెరిటేజ్ సంస్థను చట్టబద్ధంగా నడుపుతూ పారదర్శక విధానాలతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు, గుర్తింపు పొందిందని నోటీసుల్లో గుర్తు చేసింది. పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ దేశంలోనే ప్రీమియం బ్రాండ్ గా హెరిటేజ్ గుర్తింపు పొందిందని వివరించింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఇతర వైసీపీ నేతలతో కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు చేశారని నోటీసుల్లో మండిపడింది.

ఇందాపూర్ డెయిరీతో ఎటువంటి సంబంధం లేకపోయినా 2014-2019 మధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని సీరియస్ అయ్యారు. 2 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ 33ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని బొత్స సత్యనారాయణపై మండిపడింది.

హెరిటేజ్ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా పదేపదే తప్పుడు ఆరోపణలు చేశారని.. సెక్షన్ 356 ఆఫ్ బి.ఎన్.ఎస్ యాక్ట్ ప్రకారం రువు నష్టం కలిగించినందుకు బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తక్షణమే నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంది. లేని పక్షంలో హెరిటేజ్ మీపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ బొత్సకు నోటీసులు జారీ చేసింది.

కాగా, 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించిన సంగతి తెలిసిందే.

Also Read: కోవా బన్ వలీకి ఏపీ మంత్రి మద్దతు.. బన్ తినడమే కాదు.. ఇంకా ఆ సాయం కూడా