Tadipatri : తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్.. పెద్దారెడ్డి హౌస్‌ అరెస్ట్‌.. భారీ బందోబస్తు

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకిదిగి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.

High tension in Tadipatri once again Kethireddy Pedda Reddy house arrest

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీకూడలిలో దీక్ష చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఇప్పుడు దీక్ష చేయడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీక్షచేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Also Read : Gade Sai Krishna Case : సాయికృష్ణ కేసులో సంచలన మలుపు.. హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ ఆరా..

కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం తాడిపత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాడిపత్రి భగత్ సింగ్ నగర్‌లోని కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలో ఆయన్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. భారీ సంఖ్యలో  వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దారెడ్డి నివాసం వద్దకు చేరుకొని పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

పోలీసుల ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో పెద్దారెడ్డిని వాహనంలో తీసుకెళ్లకుండా సిమెంట్ బెంచీలు అడ్డుపెట్టి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతున్న సమయంలో పోలీసులు లాఠీఛార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన నివాసంలోనే గృహనిర్భందం చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, పెద్దారెడ్డి తన ఇంటివద్దే దీక్ష చేపట్టినట్లు తెలిసింది. మరోవైపు తాడిపత్రి పట్టణంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా పట్టణంలోని కీలక పాత్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

తాజా పరిణామాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తంతో రెడ్ బుక్ తడిచి పోయింది. తాడిపత్రిలో పోలీసులు ఉన్నా ప్రయోజనం లేదు. పోలీసులు కళ్లముందే పార్టీ నాయకుడు శివ కేశవ రెడ్డిపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులుపై దాడి చేసినా దిక్కు లేదంటూ పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడిపత్రి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వివాదంకు దిగారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు కనిపించవా? అని ప్రశ్నించారు. అనంతపురం పోలీసులకు హైకోర్టు ఆదేశాల కన్నా.. జేసీ ఆదేశాలే ముఖ్యమా? జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలను ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటామని అన్నారు.