Naveen Nischal: హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్ రాజీనామా
హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేత, మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్ (Naveen Nischal)రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
- V Santhosh Kumar
- Published on- September 25, 2026 / 08:18 PM IST
Hindupur ysrcp ex incharge naveen nischal resigns party
Naveen Nischal: శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేత, మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్(Naveen Nischal) షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న నవీన్ నిశ్చల్ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంతో హిందూపురం వైసీపీ వర్గాల్లో తీవ్ర అలజడి మొదలైంది. ఆయన నిష్క్రమణతో రాబోయే రోజుల్లో హిందూపురంలో వైసీపీ మరింత బలహీనపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బాలకృష్ణపై పోటీ చేసిన చరిత్ర – అసంతృప్తికి గల కారణాలు:
నవీన్ నిశ్చల్‌కు హిందూపురం నియోజకవర్గంలో సొంత బలగంతో పాటు మంచి ప్రజాదరణ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈయన అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం శ్రమించారు. అయితే, 2024 ఎన్నికలకు ముందు పార్టీ అధిష్ఠానం ఆయనను పక్కన పెట్టి దీపికకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ నిశ్చల్ నాటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ – నవీన్ నిశ్చల్ అడుగులు ఎటువైపు?
రాజీనామా అనంతరం నవీన్ నిశ్చల్ ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారనే అంశంపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. త్వరలోనే తన అనుచరులు, మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ రాజకీయ ప్రణాళికను వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో హిందూపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
