IAS Officer Srilakshmi : రెండేళ్ల నిరీక్షణకు ముగింపు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పోస్టింగ్..!
IAS Officer Srilakshmi : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని GAD స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Sreehari A
- Published on- June 25, 2026 / 06:47 PM IST
IAS Officer Srilakshmi
IAS Officer Srilakshmi : ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియామించింది. సాధారణ పరిపాలన శాఖ (GAD) పరిధిలోని పాలనా సంస్కరణల విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రస్తుత సీఎస్ కే సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇప్పటివరకు ఈ విభాగానికి అదనపు బాధ్యతలు నిర్వహించే షంషేర్ సింగ్ రావత్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. దాంతో రావత్ స్థానంలో శ్రీలక్ష్మి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
1988 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గతంలో ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని తిరిగి పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంవోతో పాటు పలు కీలక శాఖల్లో ఆమెకు ప్రాధాన్యత లభించింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీలక్ష్మికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమెకు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ ఏడాది జూలై 31న ఆమె పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌కు కొద్దికాలం ముందే ఈ నియామకం జరగడం గమనార్హం.
