Jada Sravan Kumar (Photo : Google)
Ex Judge Jada Sravan Kumar : మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలిశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని సీపీ కాంతి రాణాకు ఆయన ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో తెలిపారు. తన ఆఫీసు, నివాసం వద్ద సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు.
Also Read..Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నానని, అందుకే తనను చంపాలని చూస్తున్నారని ఆయన వాపోయారు. పోలీసులు స్పందించని పక్షంలో హైకోర్టుకి వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకుంటాను అని శ్రావణ్ కుమార్ చెప్పారు. నాకు ఏదైన హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, చంద్రబాబు అరెస్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో జడ శ్రావణ్ కుమార్ ఒకరు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం జగన్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. కుట్ర రాజకీయాలతో చంద్రబాబు అక్రమ అరెస్టుకు బలయ్యారని వాపోయారు. చంద్రబాబు అరెస్ట్ తో సంబరాలు చేసుకునే మంత్రులు కూడా ఎన్నో ఫైల్స్ పై సంతకాలు చేశారని, వారు దోచుకున్న ప్రతి రూపాయినీ కక్కిస్తామన్నారు. వైసీపీ చేసిన ప్రతి దుర్మార్గానికి సమాధానం చెబుతామన్నారు. రాష్ట్రానికి సైంధవుడిలా జగన్ తయారయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని దళితులు, ప్రజాస్వామ్యవాదులు చంద్రబాబుతోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
Also Read..TDP Janasena Alliance: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. తర్వాత ఏం జరగబోతోంది?
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.