ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదు.. అదే నేను చేసిన తప్పా? : జక్కంపూడి రాజా

నేను చేసిన తప్పేంటో, నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదు. రాజకీయాల్లో చూడాల్సింది ఇంకా చాలా ఉందని అనిపిస్తోంది.

Jakkampudi Raja: రాజానగరంలో తమ ఓటమిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించారు. తూర్పుగోదావరి రాజమండ్రిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి జీర్ణించుకోలేకపోతున్నానని, తనను ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని వాపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా తీసుకోలేకపోతున్నానని చెప్పారు. ఆఖరి శ్వాస వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే నడుస్తానని అన్నారు.

”చిన్ననాటి నుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూశాను. రాజకీయాల్లో కింద పడటం, లేవడం చాలా సార్లు చూశాను. కానీ నేను చేసిన తప్పేంటో, నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదు. రాజకీయాల్లో చూడాల్సింది ఇంకా చాలా ఉందని అనిపిస్తోంది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే నైజం చంద్రబాబుది కాదు. రాజకీయాలలో విలువలు పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మారల్సింది మా మైండ్ సెట్ అని అనుకుంటున్నాను.

అది నా తప్పా?
ఏరోజు నా భార్యతో గాని నా పిల్లలతో గాని 10 నిమిషాలు కూర్చున్న పరిస్థితి లేదు. నా కాళ్లకు వ్యాధి ఉన్నా, నడవలేని స్థితిలో ఉన్నా నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు కాలినడకన తిరిగాను. ప్రజలే జీవితం అనుకుని భ్రమలో ఇప్పటిదాకా బతికాను. నన్ను కన్నతల్లికి, అమ్మమ్మకి ఒంట్లో బాగోలేకపోయినా వారి దగ్గర ఉండలేకపోయాను. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా తీసుకోలేకపోతున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఈ రకమైన ఓటమిని చవిచూస్తామని అనుకోలేదు. రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగిలినా మా నడవడిక మారదు. లక్షల రూపాయలు విలువ చేసే భూములను పేదలకు ఉచితంగా ఇచ్చాను అది నా తప్పా? రాజకీయాల కోసం నేను చేసిన అప్పులుకు నా ఆస్తులు మొత్తం అమ్మినా సరిపోవు.

Also Read: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా ఓట్ల వివరాలు.. పవన్ కళ్యాణ్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..

జగనే రియల్ హీరో..
ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎమ్మెల్యేలను రేపు.. ఎల్లుండి అంటూ ఐదు సంవత్సరాల తరబడి ఆయన తిప్పించుకున్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం ధనుంజయ రెడ్డి కాళ్ల చుట్టూ తిరిగేవాళ్లం. ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డిగా నమ్మారు.‌ సచివాలయంలో అధికారులు కూడా సరిగా స్పందించేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడినా, గెలిచిన ఆయన రియల్ హీరో. జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించార”ని జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు