AP Capital : రాజధాని గ్రామాల్లో జనసేన నేతల పర్యటన

  • Publish Date - December 20, 2019 / 12:42 AM IST

అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. గురువారం బంద్ పాటించిన 29గ్రామాల రైతులు.. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం నుంచి నిరసనల డోసు పెంచనున్నారు. ఇప్పటి వరకు ఎవరికి వారు విడివిడిగా ఆందోళనలు చేసిన 29 గ్రామాల ప్రజలు ఇక పై ఐక్య కార్యాచరణతో ముందుకు సాగనున్నారు. వెలగపూడిలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు కొనసాగిస్తూనే మందడంలో ఉదయం 9 గంటలకు మహాధర్నాను రైతులు చేపట్టనున్నారు. తుళ్లూరులో మహిళలు వంటా వార్పు చేపట్టనున్నారు. 

 

రాజధాని రైతుల ఆందోళనకు జనసేన మద్దతు తెలపనుంది. రాజధాని గ్రామాల రైతులను ఇవాళ జనసేన నాయకులు కలవనున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచన మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించనుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబుతోపాటు కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు. ఉదయం 10గంటలకు మంగళగిరిలో జనసేన కార్యాలయం నుంచి బయలుదేరి మందడం చేరుకొని అక్కడి రైతాంగం.. రైతు కూలీలతో మాట్లాడతారు. అనంతరం వెలగపూడిలో రైతుల నిరాహార దీక్ష శిబిరానికి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గంటకు తుళ్ళూరులో వంటా వార్పు కార్యక్రమానికి హాజరవుతారు.

మరోవైపు రాజధాని కోసం పోరులో.. ప్రజలంతా.. స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారు.  పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలతో తమ నిరసన తెలియజేస్తున్నారు. తుళ్లూరు వాసులు రోడ్లపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. దొండపాడులో పురుగుమందు డబ్బాలు పట్టుకొని రైతులు నిరసనగళం వినిపించారు. రాజధాని మారిస్తే.. ఆత్మహత్యలకైనా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మందడంలో రైతులు రాస్తారోకో చేశారు. తల ఒక దగ్గరుంటే.. మొండెం మరో దగ్గరుండాలనే విధంగా సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు.

రాజధాని కోసం జరిగిన ఆందోళనల్లో.. మహిళలతో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం భూములిస్తే.. ఇప్పుడు వాళ్లను రోడ్డున పడేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోకపోతే.. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అమరావతి ప్రాంత రైతులు హెచ్చరించారు.

Read More : రాజధాని కోసం : నిపుణుల కమిటీ రిపోర్ట్ రెడీ..నివేదికలో ఏముందో

ట్రెండింగ్ వార్తలు