Janasena Party : మళ్లీ 100శాతం స్ట్రైక్‌రేట్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అదరగొట్టిన జనసేన.. ఫలించిన పవన్ వ్యూహం..

Janasena Party : ఏపీలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ సత్తాచాటింది. కూటమి పొత్తులో భాగంగా పార్టీ దక్కించుకున్న అన్ని స్థానాల్లో విజయం సాధించింది.

JanaSena Party

Janasena Party : ఏపీలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల్లో కూటమి పార్టీల అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధించారు. ఇదేక్రమంలో జనసేన పార్టీ మళ్లీ 100శాతం స్ట్రైక్‌రేట్ తో అదరగొట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన పార్టీ.. ప్రస్తుతం కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కిన మేయర్, చైర్‌పర్సన్ స్థానాల్లో అన్నింటిల్లోనూ విజయబావుటా ఎగురవేసింది.

Also Read : AB Venkateswara Rao : అయ్యో ఇలా జరిగిందేంటి..! ఏబీ వెంకటేశ్వరరావు అంచనాలు తలకిందులు.. గట్టి షాకిచ్చిన ఓటర్లు..

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి నాలుగు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు దక్కాయి. ప్రస్తుతం జరిగిన రెండు కార్పొరేషన్లు (విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ విజయం సాధించగా.. ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు విజయం సాధించారు), 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో గెలుపు సాధించి మొత్తం అన్నిచోట్లా జయకేతనం ఎగురవేసి రికార్డు నెలకొల్పింది.

2024లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఎన్నికలను కేవలం గెలుపోటములకే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించుకునేందుకు వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాలతో పాటు కొత్త ప్రాంతాల్లోనూ రాజకీయంగా పట్టు సాధించే దిశగా అడుగులు వేసింది.

జనసేన పార్టీ ముఖ్యంగా విజయవాడ నగరంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాన నగరాల్లో ఒకటైన విజయవాడలో ఇప్పటివరకు పార్టీకి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో మేయర్‌ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను బరిలోకి దింపడం ద్వారా నగరంలో పార్టీకి నాయకత్వాన్ని అందించే ప్రయత్నం చేసింది. తద్వారా విజయవాడలో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేసింది.

పిఠాపురం, తెనాలి, పాలకొండ, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే జనసేన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన కొన్ని స్థానాలను దక్కించుకొని పోటీ చేసింది. అయితే, కాకినాడ, తాడేపల్లిగూడెం, భీమవరాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగలేదు. మరోవైపు ఏలూరు కార్పొరేషన్‌, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లోనూ పార్టీ విస్తరణకు అనుగుణంగా పొత్తులో భాగంగా స్థానాలను దక్కించుకుంది. వీటితో పాటు తుని, పెద్దాపురం (సామర్లకోట మున్సిపాలిటీ), దర్శి, తిరువూరు, చిలకలూరిపేట, ముమ్మిడివరం, అమలాపురం, పెడన, మడకశిర, పుట్టపర్తి, నగరి (పుత్తూరు మున్సిపాలిటీ) ప్రాంతాల్లోనూ పోటీకి దిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో విజయం సాధించింది.

కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన నాయకులకు పార్టీ అవకాశం కల్పించింది. వారు కూడా ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం లభించిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మొత్తంగా స్థానిక ఎన్నికల ద్వారా ఇప్పటికే బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యాన్ని కొనసాగించడంతో పాటు, కొత్త ప్రాంతాల్లోనూ జనసేన తన ఉనికిని విస్తరించుకునే ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత బలోపేతానికి దోహదపడతాయని జనసేన శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.