7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత జేసీకి బెయిల్ వచ్చింది. అయితే సరైన పత్రాలు సమర్పించలేదని పోలీసులు జేసీని స్టేషన్ లో ఉంచారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆయన వెంటనే రిలీజ్ కాలేకపోయారు. సుమారు 7 గంటల పాటు పీఎస్ లోనే ఉండాల్సి వచ్చింది. చివరికి శనివారం(జనవరి 4,2020) రాత్రి 7 గంటల ప్రాంతంలో పీఎస్ నుంచి బయటకు వచ్చారు.
కాగా, పోలీసులు కావాలనే బెయిల్ ప్రక్రియ ఆలస్యం చేశారని జేసీ అనుచరులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఓ అనుచరుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పీఎస్ ముందు కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాము అధికారంలోకి వచ్చాక పోలీసులతో బూట్లు నాకిస్తా, గంజాయి కేసులు పెడతాం అంటూ చంద్రబాబు సమక్షంలోనే ఇటీవల జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు 153, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read : 4 పంటలు పండే పొలాల్లో రాజధాని నిర్మాణం అసాధ్యమని చంద్రబాబుకి ముందే తెలుసు