జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. వార్నింగ్‌లు ఇచ్చుకున్న నేతలు..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తన నివాసానికి వచ్చారు.
- Harishth Thanniru
- Published On : June 29, 2025 / 01:36 PM IST
JC Prabhakar Reddy Kethireddy Pedda Reddy
Kethireddy Pedda Reddy – JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటివైపు బయలుదేరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగివారని అడ్డుకున్నారు. మరోవైపు పెద్దారెడ్డిని బలవతంగా తాడిపత్రి నుంచి అనంతపురంకు తరలించారు. ఈ సందర్భంగా జేసీ, పెద్దారెడ్డి ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకున్నారు.
Also Read: తాడిపత్రిలో హైటెన్షన్.. తన నివాసానికి పెద్దారెడ్డి.. రంగంలోకి పోలీసులు.. బలవంతంగా తరలింపు..
చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది..
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. నన్ను చూసి జేసీ భయపడుతున్నాడు. నేను తాడిపత్రిలో ఉంటే వాళ్ల ఆగడాలు సాగనివ్వనని భయపడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ కాళ్లు పట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుతున్నాడని పెద్దారెడ్డి అన్నారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారు. నా ఆస్తులను టార్గెట్ చేశారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా తాడిపత్రిలోని నా ఇంటికి కొలతలు వేయించారు. నేను మున్సిపల్ స్థలం ఆక్రమించలేదు. కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేశా. నాపై జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అంటూ పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దారెడ్డికి జేసీ స్ట్రాంగ్ వార్నింగ్..
తాడిపత్రి టిడిపి కార్యకర్తలకు శత్రువు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే వైసీపీ కార్యకర్తలు కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మేము ఇంతవరకు వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్లలేదు. వైసీపీ నాయకుల మీదకు లీగల్ గానే వెళ్తున్నాం. పెద్దారెడ్డి ఇల్లు రిజిస్ట్రేషన్ అక్రమమైనది. నేడు పెద్దారెడ్డి దగ్గరికి ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వచ్చారో వారి ఫొటోలు నా వద్ద ఉన్నాయి. పెద్దారెడ్డి ఇంటి వద్దకు ఎవరు వచ్చారో వారి ఇంటివద్దకు మా కార్యకర్తలు వచ్చి రఫారఫా ఆడిస్తారు. నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే అరగంటలో 2వేల మంది వచ్చారు. పోలీసులు రాకుంటే మా కార్యకర్తలు నీకు సినిమా చూపించేవాళ్లు. ట్రాక్టర్లతో రాళ్లు తోలించి రెడీగా ఉంచారు.
వైసీపీ పార్టీలో పెద్దారెడ్డి పెద్ద లీడర్ అంటున్నారు. అతని నియోజకవర్గంలోకి రాలేని వ్యక్తి పెద్ద లీడర్ ఎలా అవుతాడు. పెద్దారెడ్డి.. నీ వద్ద ఉన్న కార్యకర్తలను నువ్వు కాపాడుకో.. నా వద్ద ఉన్న కార్యకర్తలను నేను కాపాడుకుంటా. నా కార్యకర్తలకు ఒక్క ఫోన్ చేస్తే ఆదివారం అయినా రెండు వేల మంది వచ్చారు. నేను ఊరికి వెళ్తున్నా.. మూడు రోజుల్లో నీ ఇల్లు పడగొడతారేమో కాపాడుకో పెద్దారెడ్డి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
