Kesineni Nani vs Kesineni Chinni : కేశినేని నానిపై రూ.120కోట్ల రుణ కుంభకోణం ఆరోపణలు.. ఇదిగో ప్రూప్స్.. చిన్ని సంచలన కామెంట్స్..
Kesineni Nani vs Kesineni Chinni : విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని నాని రూ.120కోట్ల బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు.
- Harish Thanniru
- Published on- June 14, 2026 / 11:06 AM IST
Kesineni Nani vs Kesineni Chinni
- కొనసాగుతున్న కేశినేని చిన్న, నాని వివాదం
- నానిపై సంచలన ఆరోపణలు చేసిన చిన్ని
- 120కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలు
Kesineni Nani vs Kesineni Chinni : ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేస్తున్నారు. ఇప్పటికే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేశినేని నానిపై ప్రస్తుత విజయవాడ ఎంపీ, ఆయన సోదరుడు కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో రుణ కుంభకోణం అంటూ నానిపై చిన్ని సంచలన ఆరోపణలు చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని నాని రూ.120కోట్ల బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. రుణాలిచ్చే జాతీయ బ్యాంకులు రైతులు రెండు వాయిదాలు కట్టకుంటే పొలం లాక్కుంటారు, మూడు వాయిదాలు కట్టకుంటే ఆటో డ్రైవర్ల నుంచి వాహనం లాక్కుంటారు. ప్రజా ధనం లూటీ చేసిన మాజీ ఎంపీ రుణం గురించి పట్టించుకోని బ్యాంకు అధికారులు ఎవరితో లాలూచీ పడ్డారు? అంటూ చిన్ని ప్రశ్నించారు.
న్యాయ వ్యవస్థలో చిన్న లూప్ హోల్ అడ్డంపెట్టుకుని న్యాయస్థానాలనుసైతం కేశినేని నాని తప్పుదోవ పట్టించారని, తనపై పోటీ చేసిన అభ్యర్థుల్ని ఫ్రాడ్ అనటం కేశినేని నానికి అలవాటని కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకొస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లనూ విమర్శించాడు. ఒక్క సాక్షి మీడియా, జగన్‌ను తప్ప ఇతరులదరినీ విరమర్శించే నాని ఆంతర్యం ఏంటి? అంటూ చిన్ని ప్రశ్నించారు.
జగన్ పంథాలోనే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు చేయటం నానికి అలవాటు. సామాజిక మాధ్యమం వేదికగా నాని నాపై చేసేది అసత్య ఆరోపణలే. దీనిపై పోలీసులు తమ పని తాను చేసుకెళ్తున్నారు. విజయవాడ ప్రజలకు, అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు మాత్రమే తాను జవాబుదారినని, సోషల్ మీడియా పోస్టులకు కాదని పేర్కొన్నారు. తనపై చేసే ఆరోపణలకు సరైన ఆధారాలు ఉంటే వాటికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని కేశినేని చిన్నీ స్పష్టం చేశారు.
