Andhra Pradesh : ఓట్ల లెక్కింపులో ఊహించని ట్విస్ట్.. బ్యాలెట్ బాక్స్‌లో కరపత్రాలు.. చంద్రబాబు, పవన్, లోకేశ్ పేర్లను ప్రస్తావిస్తూ..

Andhra Pradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

AP Local Body Elections

Andhra Pradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి శనివారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ అధికారులు కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

Also Read : AP ZPTC MPTC Elections Results : తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆసక్తికర సంఘటన.. టెన్షన్ వాతావరణం.. పోలీసుల పటిష్ఠ భద్రత

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంఏ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతోపాటు కరపత్రాలను కౌంటింగ్ సిబ్బంది గుర్తించారు. ఈ కరపత్రాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు పేర్లను ప్రస్తావిస్తూ తమ సమస్యను విన్నవించుకున్నారు.

కరపత్రంలో.. ‘‘ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేశ్, లోకసభ సభ్యులు, శాసన సభ్యులకు కంకణాలపల్లి గ్రామస్తుల విన్నపం. మా గ్రామంనకు నేరుగా ఉన్న రహదారిలో రైల్వే వారు కొత్తగా యూ ఆకారంలో నిర్మాణం చేపడుతున్నారు. యూ ఆకారంలో నిర్మించడం వలన మా గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రస్తుతం నేరుగా ఉన్న రహదారిలోనే రైల్వే అండర్ పాస్ నిర్మించి మా గ్రామాన్ని కాపాడాల్సిందిగా వేడుకుంటున్నాము.’’ అని రాసి ఉంది.

చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. చెల్లని బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొయ్యురు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. అయితే, ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే చెల్లని ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మొత్తం 201 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకుగాను టీడీపీకి 50, వైసీపీకి 54, స్వతంత్రులకు 11 ఓట్లు పోలయ్యాయి. చెల్లని బ్యాలెట్ పేపర్లు 85గా నమోదు కావడం గమనార్హం. ఇదే జిల్లాలోని అనంతగిరి మండలంలో 137 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత షాకింగ్ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పోలైన ఓట్లలో 91 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివిగా అధికారులు గుర్తించారు.

అదేవిధంగా ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకుగాను కేవలం రెండు మాత్రం చెల్లుబాటయ్యాయి. మిగిలిన 64 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. చెల్లుబాటైన రెండు పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు టీడీపీకి దక్కడం గమనార్హం.