Ysrcp Resigned Mlcs: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై వారితో లోపాయకారి ఒప్పందం కారణంగా వాళ్లు రాజీనామా చేశారని వైసీపీ ఆరోపించింది.
- Naveen
- Published On : February 20, 2026 / 05:44 PM IST
AP Legislative Council
Ysrcp Resigned Mlcs: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకటరమణకు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ నెల 26న విచారణకు రావాలని కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలకు నోటీసులు జారీ చేశారు. అలాగే అదే రోజు విచారణకు రావాలని పోతుల సునీత, మర్రి రాజశేఖర్ కు కూడా నోటీసులు ఇచ్చారు.
వైసీపీ నుంచి ఎన్నికైన కొందరు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, వారి రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంతవరకు వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించలేదు. తమ రాజీనామాలు ఆమోదించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా.. మండలి చైర్మన్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. తమ రాజీనామాల ఆమోదం విషయంలో ఎమ్మెల్సీలు హైకోర్టును కూడా ఆశ్రయించారు.
ఎమ్మెల్సీల రాజీనామా అంశంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై వారితో లోపాయకారి ఒప్పందం కారణంగా వాళ్లు రాజీనామా చేశారని ఆరోపించింది.
తాజాగా ఈ వ్యవహారంలో కదలిక వచ్చింది. కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణకు మండలి చైర్మన్ నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మండలిలో బలాన్ని పెంచుకోవడంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకున్నారు. అయితే, పార్టీ ఫిరాయింపు కారణంగా వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. వీళ్లు అనర్హులు అయ్యాక బలాబలాలను బట్టి ఆ స్థానాలన్నీ కూటమికి దక్కే ఛాన్స్ ఉంది. అధికార పార్టీకి మేలు చేయడానికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని గమనించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు.. వారి రాజీనామాల ఆమోదాన్ని పెండింగ్ లో పెడుతూ వచ్చారు. తాజాగా మండలి చైర్మన్ వారిని విచారణకు పిలిచారు. విచారణ తర్వాత ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: మండలిలో ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఛైర్మన్ టేబుల్‌పై పడేసిన వైసీపీ సభ్యులు.. రచ్చ రచ్చ
