LPG Cylinder explodes in kitchen : విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో వంటగ్యాస్ లీకైన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఆరుగురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన గల ఇంటిలో గవర అప్పారావు భార్య మహేశ్వరి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వంట చేస్తుండగా గ్యాస్ అయిుపోయింది. సిలిండర్ మార్చి ఆమె తరిగి వంటకు సిధ్దమవుతుండగా గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించింది. వంటగది మొత్తం గ్యాస్ వ్యాపించటంతో ఆమె భయపడి కేకలు వేస్తూ బయటికి పరిగెత్తింది.
దీంతో ప్రక్క ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులు…. అప్పారావు, గొంగ నాయుడు లు ఇంట్లోకి వచ్చి లీక్ అవుతున్న గ్యాస్ సిలిండర్ పై మూతను వేసి రెగ్యులేటర్ ని గట్టిగా బిగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే గ్యాసు వంట గది మొత్తం వ్యాపించి ఉంది. ఆసమయంలో ఆమె లైట్ వేయటం… గ్యాస్ గది మొత్తం వ్యాపించి ఉండడంతో హఠాత్తుగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి.
దీంతో మహేశ్వరి తో పాటు ఇద్దరు యువకులు ఇంటి బయటకు పడిపోయారు…. అంతేకాక ప్రక్కనే ఉన్న అమూల్య, నేహ, సౌమ్యలు కూడా స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని 108 అంబులెన్స్ లో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఫైర్ ఎస్సై దిలీప్ కుమార్ తన సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు.
అనంతరం పరిసరాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ కేవలం సిలిండర్ ను సరిగ్గా బిగించకపోవడం వలనే గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేశారు. అయితే తీవ్రంగా గాయపడిన మహేశ్వరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బంధువులు చెబుతున్నారు. పేలుడు ధాటికి ఇంటి గోడలు బీటలు వారాయి. ప్రహరీ, గేటు ధ్వంసమయ్యింది. సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.