Nellore Lockup Death : నెల్లూరులో లాకప్ డెత్ కలకలం.. మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఏమి జరిగింది?.. ఏడుకొండలు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన
Nellore Lockup Death : నెల్లూరు జిల్లాలోని మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది.
- Harish Thanniru
- Published on- July 15, 2026 / 07:41 AM IST
Man Dies Manubolu Police Station Nellore District
- నెల్లూరులో లాకప్ డెత్ కలకలం..
- మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఏమి జరిగింది?
- ఏడుకొండలు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన
Nellore Lockup Death : నెల్లూరు జిల్లాలోని మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది. చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలు (50) అనే వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు చేస్తున్నారు.
Also Read : KCR-Mudragada : రాజీలేని పోరాట యోధుడిని కోల్పోయాం.. ముద్రగడ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
బంగారం గొలుసు చోరీ కేసులో చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలును మనుబోలు పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌లో విచారించిన తరువాత.. స్టేషన్ బెయిల్ పై విడిచి పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడు కొండలు గ్రామంలో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు చెరుకుమూడి గ్రామంకు వెళ్లి అతన్ని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తీసుకెళ్లిన తరువాత పోలీసులు అతన్ని చితకబాదడంతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఐదు రోజుల క్రితం చోరీ కేసులో ఏడుకొండలను మనుబోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి ఎస్‌ఐతో పాటు పోలీసులు తీవ్రంగా కొట్టారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ఏడుకొండలు పోలీసుల అదుపులో ఉన్నారనే సమాచారాన్నికూడా ఇవ్వలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఏడుకొండలు గడ్డి మందు తాగి మృతి చెందాడని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు భిన్నమైన వివరణ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఇక ఏడుకొండలను పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు కారణమవుతోంది. మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన పరిస్థితులు, ఘటన జరిగిన తీరు, పోలీసుల వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై అధికారిక వివరాలు, పోస్టుమార్టం నివేదిక వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
