KCR-Mudragada : రాజీలేని పోరాట యోధుడిని కోల్పోయాం.. ముద్రగడ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
KCR-Mudragada : ముద్రగడ పద్మనాభం మృతిపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటుగా పేర్కొన్నారు.
KCR-Mudragada
KCR-Mudragada : ఏపీ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన ప్రత్యామ్నాయ రాజకీయవేత్త ముద్రగడ అని కొనియాడారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటుగా పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం మరణం వార్త తనను ఎంతో తీవ్రంగా కలచివేసిందని కేసీఆర్ అన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ముద్రగడ.. మంత్రిగా కూడా సమర్థవంతంగా సేవలందించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని వైఖరితో పనిచేసిన గొప్ప ప్రజానాయకుడిగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు ఉందని బీఆర్ఎస్ అధినేత అన్నారు.
Read Also : YS Jagan-Mudragada : ముద్రగడ మరణం తీరని లోటు.. పితృసమానుడిని కోల్పోయాం: వైఎస్ జగన్
అందులోనూ కాపు వర్గాల అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన కృషి ఎంతో చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, కాపులకు, అనుబంధ కులాలకు పూర్తిస్థాయిలో అందాలనే లక్ష్యంతో ఆయన నిరంతరం ఉద్యమించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను విశ్వసించిన సిద్ధాంతం కోసం జీవితకాలం ఎలాంటి రాజీ పడకుండా పోరాడిన అరుదైన నాయకుడిగా ముద్రగడ నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు.
ముద్రగడ పద్మనాభం మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటగా కేసీఆర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు కూడా ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారందరికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
