Fire Accident in Amaravati : అమరావతిలో మరో అగ్ని ప్రమాదం.. కుట్ర కోణం ఉందనే అనుమానం.. విచారణకు ఆదేశించిన హోం మంత్రి
Fire Accident in Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకంది.
- Dharani Pilli
- Published On : March 24, 2026 / 09:09 AM IST
massive fire accident in amaravati rayapudi area home minister orders probe
Fire Accident in Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయపూడి సమీపంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీల బిల్డింగుల నిర్మాణ ప్రాంగణంలో సోమవారం రాత్రి ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజధాని నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఇక్కడ నిల్వ చేసిన పైపులకు మంటలు అంటుకుని.. అకస్మాత్తుగా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా నిప్పులు ఎగసిపడ్డాయి. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలను అదుపు చేయడానికి దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అమరావతిలో ఇలా అగ్ని ప్రమాదం సంభవించడం ఇదే ప్రథమం కాదు. మార్చి 11వ తేదీన వెలగపూడి సమీపంలో ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెందిన రూ. కోట్ల విలువైన హెచ్‌డీపీఈ పైపులు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. తాజాగా రాయపూడి సమీపంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో.. దీనిపై విచారణ చేసి.. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ‘‘అగ్నిమాపక యంత్రాలు రాత్రంతా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ఒకే విధంగా పైపులు వరుస ఘటనల్లో తగలపడటంపై విచారణకు ఆదేశించాం. కలెక్టర్ల సదస్సు రోజు జరిగిన ప్రమాదం కూడా ఉద్దేశపూర్వకంగా చేసిందేననే అనుమానాలు ఉన్నాయ్. అమరావతి ప్రాంతంలో గత కొద్దిరోజులుగా వర్షం కురిసినందున ప్రమాదవశాత్తు ఘటన జరగటానికి అవకాశాలు తక్కువ. నిన్న ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ భూమి పూజ ఘనంగా జరిగింది. ఇది చూసి ఓర్వలేక రాజధానిలో పైపులకు నిపు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో రాజధాని అమరావతి నిర్మాణం ఓర్వలేక అరటితోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయి. పోలీసు శాఖ అన్ని కోణంలోనూ విచారణ చేస్తోంది. రాజధాని అమరావతి పై ఎవరు కుట్రలు పన్నినా ఉపేక్షించేది లేదు’’ అన్నారు.
రెండు వారాల వ్యవధిలోనే అమరావతి రాజధాని ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. వరుస అగ్ని ప్రమాద ఘటనల వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా.. అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
