AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. పిడుగులతో కూడిన వానలు.. బయటకు రావొద్దు..

AP Rainfall Alert: ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Meteorological Department Warns Heavy Rains in Andhra Pradesh

  • ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
  • పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
  • పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ

AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు రెడ్‌అలర్ట్ జారీ చేసింది.

Also Read – CM Chandrababu Naidu: సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదేవిధంగా పోలవరం ప్రాంతం, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు.

విశాఖపట్టణంలో, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి , సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గత 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. నందిగామలో 38 మిల్లీమీటర్లు, గన్నవరం పరిసరాల్లో 35.7 మిల్లీమీటర్లు, ఇతర ప్రాంతాల్లో 30 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న రైతులు వర్షాలు, పిడుగుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. పంట పొలాల్లో నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని హెచ్చరించింది.