AP Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..

AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో భీకర గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.

AP Rains Alert

  • ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్
  • నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

AP Rain Alert : ఏపీలోని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నేడు (ఆదివారం) కూడా భీకరగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Also Read : YS Jaganmohan Reddy : అమరావతిలో వైసీపీ నేతలపై దాడి.. వారికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెట్టింపు స్పందన ఉంటుందని మర్చిపోవద్దు..

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. ఆదివారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతాయని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలతోపాటు భీకర గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

నేడు శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అలాగే కోస్తాంధ్ర నుంచి మహారాష్ట్ర వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని.. అలాగే ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

వర్షాలు పడే సమయంలో.. ఈదురు గాలులు, ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ప్రజలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది. రైతులు, పశువులకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

ఇదిలాఉంటే.. శనివారం మచిలీపట్నంలో భారీ వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజామున సుమారు 6గంటల ప్రాంతంలో మొదలైన వర్షం మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. దీంతో ప్రధాన వీధులతోపాటు పలు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.