AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ
AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది
- Harish Thanniru
- Updated on- July 5, 2026 / 07:26 AM IST
AP Rains
- బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
- ఏపీకి భారీ వర్ష సూచన
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం (Low-pressure area in the Bay of Bengal) బలపడిందని, ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. వచ్చే రెండుమూడు రోజుల్లో అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపుగా పయనించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులతో కూడిన వర్షం పడే చాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
మరోవైపు.. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ వరకూ విస్తరించి ఉన్న నైరుతి రుతుపవన ద్రోణి వచ్చే మూడ్రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వైపు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
శనివారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా పప్పల లింగాలవలసలో 4.1, మన్యం జిల్లా సీతానగరంలో 3.09, దత్తిరాజేరులో 2.92, మక్కువలో 2.62, పురోహితునివలసలో 2.6, పాచిపెంటలో 2.45, శ్రీకాకుళం జిల్లా జీ సిగడాంలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని, చెట్లు కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
