AP Rain Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో నాలుగురోజులు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
AP Rain Alert : ద్రోణి ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- October 15, 2026 / 06:29 PM IST
AP Rain Alert
AP Rain Alert : ఏపీలో ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ద్రోణి ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం మేఘావృత వాతావరణం ఉంటుంది. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శుక్రవారం విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్టణం, పోలవరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శనివారం అల్లూరిసీతారామరాజు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇదిలాఉంటే.. గురువారం అత్యధికంగా తిరుపతి జిల్లా అలివేలుమంగాపురంలో 87.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 57.2, కావలిలో 53.3, చిత్తూరు అర్బన్లో 51.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఓబులవారిపల్లె, పెన్నేపల్లి, రేణిగుంట, పుత్తూరు, నాయుడుపేటలోన వర్షం కురిసింది. అయితే రానున్ననాలుగు రోజులు వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు వర్సాలు, ఈదురుగాలుల సమయంలో పొలాల్లో, చెట్ల కింద ఉండొద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ప్రస్తుతం ఏపీలో వర్షాలు లేక రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రతతో నీటి కొరత ఏర్పడంతో వర్షాలకోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే అవకాశం ఉంది.
