Nara Lokesh: వైసీపీ నుంచి వచ్చే వలసదారులతో జాగ్రత్త, పదవులకు సిఫార్సులు చెల్లవు- మంత్రి నారా లోకేశ్
రెవెన్యూ విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎంతమాత్రం ఉండకూడదు. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలు, పెట్టుబడిదారులను బెదిరించే వ్యవహారాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉంటే పార్టీ ఉపేక్షించదు.
- Naveen
- Published On : April 1, 2026 / 06:45 AM IST
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సమన్వయకర్తలు భూమిరెడ్డి, బీదా రవిచంద్ర, సుజయ్ కృష్ణ రంగారావు, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, వేపాడ చిరంజీవి రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.
వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన టీడీపీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించారు. అధికారంలో ఉన్నామని అవసరం కోసం వచ్చే అవకాశవాదులు.. పార్టీలో కొనసాగుతారనే గ్యారంటీ లేదన్నారు. కష్ట సమయంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకే ప్రాధాన్యం ఉండాలన్నారు. వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, అందుకు అనుగుణంగా శ్రేణులను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
”జిల్లా పార్టీ అధ్యక్షులు యాక్టీవ్ కావాలి. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ కష్టపడే పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వండి. పార్టీనే సుప్రీమ్ అనేది ఎమ్మెల్యేలకు స్పష్టం కావాలి. రెవెన్యూ విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎంతమాత్రం ఉండకూడదు. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలు, పెట్టుబడిదారులను బెదిరించే వ్యవహారాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉంటే పార్టీ ఉపేక్షించదు. పార్టీ బీఫామ్ ఇస్తేనే వాళ్లు మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నప్పుడు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీరు పార్టీకి నష్టం చేసేలా ఉంటే ఉపేక్షించేందుకు అధినేత సిద్ధంగా లేరు. పెండింగ్, నామినేటెడ్ పదవులన్నీ ప్రాధాన్యత క్రమంలో త్వరగా పూర్తి చేయాలి. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉండాలి” అని మంత్రి లోకేశ్ తేల్చి చెప్పారు.
అటు క్లస్టర్ ఇంఛార్జ్ లతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యూనిట్, బూత్ లను బలోపేతం చేయాలన్నారు. ఒక వ్యవస్థలా టీడీపీని తీర్చిదిద్దుతామన్నారు. వినే నాయకుడు చంద్రబాబు ఉండటం మన అదృష్టం. మీరంతా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రొడక్ట్. గ్రామ స్థాయి నాయకుడు బాగా పనిచేస్తే వారిని గుర్తించి పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టాలి. రాబోయే పొలిట్ బ్యూరోలో మీరు ఆ మార్పును చూడబోతున్నారు. పనిచేసే వారిని డైరెక్ట్ గా చంద్రబాబు గుర్తించి పదవులు ఇస్తున్నారు. ఎవరి సిఫార్సులు చెల్లవు. జగన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజార్డర్ వ్యాధి. ఆ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అని లోకేశ్ అన్నారు.
Also Read: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
