Payyavula Keshav – Ys Jagan: రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైంది వైఎస్ కుటుంబంతోనే- మంత్రి పయ్యావుల కేశవ్

రాజకీయాల్లో హింసను కొత్త పుంతలు తొక్కించిన ఫ్యామిలీ మీది. శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటి మీద గొడ్డలి వేటు వేసిన పార్టీ.

  • Published on- May 23, 2026 / 05:07 PM IST

Payyavula Keshav – Ys Jagan: వైఎస్ కుటుంబంతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. నేరమయ రాజకీయాలను మొదలు పెట్టింది, కొనసాగిస్తున్నది జగన్ కుటుంబమేనని ఆరోపించారు. కుటుంబాలు, వర్గాలకు మధ్య పరిమితమైన ఫ్యాక్షన్ ను రాజకీయాల్లోకి విస్తరించింది వైఎస్ రాజారెడ్డి అని చెప్పారు. గొడ్డలి పార్టీ వల్ల సమాజంలో తరాలు నష్టపోతున్నాయి కాబట్టి సమాజానికి ఆ పార్టీ హానికరమని గట్టిగా చెబుతున్నామన్నారు. శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటి మీద గొడ్డలి వేటు వేసిన పార్టీ కాబట్టే జగన్ ది గొడ్డలి పార్టీ అని ధ్వజం ఎత్తారు. తనంత మంచోడు లేడు అంటూ తనకు తాను జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం విడ్డూరమని విమర్శించారు.

”రాజా రెడ్డి హయాంలో పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై డైనమైట్ బాంబులతో దాడులు జరిగిన ఘటనలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు హింసాత్మక చర్యలకు పాల్పడిన ఘటనలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతోనే. రాజకీయాలు నేరమయం అయ్యింది వైఎస్ కుటుంబంతోనే మొదలైంది. రాజకీయాల్లో హింసను కొత్త పుంతలు తొక్కించిన ఫ్యామిలీ మీది.

పెద్దకూడాల కృష్ణారెడ్డి మర్డర్ ఆరోజున ఒక చర్చనీయాంశమైంది రాయలసీమలో. రాజకీయాలను నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదిలించుకోవడానికి ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఆయన ఒకవైపు ఉంటే లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదులు నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం” అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు మంత్రి పయ్యావుల కేశవ్.

Also Read: 3 పార్టీలు.. 4 సీట్లు.. చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి?