×
Ad

Government Jobs: 1400 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో భర్తీ.. మంత్రి కీలక ప్రకటన

బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు.

  • Published On : February 17, 2026 / 11:57 PM IST

Minister Savitha Representative Image (Image Credit To Original Source)

  • బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 933.76 కోట్లు
  • ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కోసం 145 కోట్లు రిలీజ్

 

Government Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 1400 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. సంక్షేమ హాస్టల్స్ లో త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖల మంత్రి సవిత తెలిపారు. మొత్తం 1,433 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. వీటిలో కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు ఉన్నాయి. 142 కుక్, లేబర్ పోస్టులు ఉండగా.. 1,291 పారిశుద్ధ్య (శానిటేషన్) సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇక కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతామని చెప్పారు.

6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఎంటీఎఫ్ కు 420.72 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 933.76 కోట్లు కేటాయించామని మంత్రి సవిత వెల్లడించారు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కోసం 145 కోట్లు రిలీజ్ చేశామన్నారు. 3లక్షల 5వేల 840 మంది విద్యార్థులు లబ్ది పొందారని తెలిపారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు సవిత ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు ఇస్తున్నామన్నారు. వెనుకబడిన కులాల అభివృద్ధి, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ఆ పథకాల కింద రూ.331 కోట్లు అందజేత..

ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల్లోనే డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో తల్లికి వందనం, దీపం-2 పథకం, మత్స్యకారులకు ఆర్థిక సహకారం, ఆటో డ్రైవర్ సేవలో, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ వంటి పథకాల కింద రాష్ట్రంలోని ఒక కోటి 59లక్షల 99వేల 934 మంది బీసీలకు (లబ్దిదారులకు) రూ.33వేల 331.25 కోట్లు అందించినట్లు మంత్రి సవిత వెల్లడించారు.

”బీసీలకు రెండు కళ్లు ఎన్టీఆర్, చంద్రబాబు. ఎన్టీఆర్ ఆశయాలు, స్ఫూర్తితో బీసీలను అన్ని విధాలుగా (రాజకీయం, విద్య, సామాజికం) ముందు నడిపింది మనమే. ప్రతి ఇంటి నుంచి బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఆదరణ 1, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబే. ఆదరణ 3 కూడా అమలుపరుస్తున్నాం. బీసీల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు. లోన్లు, ఆదరణ, విద్యాపరంగా బీసీలకు పెద్ద పీట వేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 1100 బీసీ సంక్షేమ హాస్టళ్లలో 84వేల 446 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నాం. అదనంగా 109 ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 39వేల 832 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అదనంగా 10 కొత్త ఎంజేపీ స్కూల్స్ స్థాపనకు అనుమతి ఇచ్చారు. అలాగే 6 రెసిడెన్షియల్ పాఠశాలలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలుగా అభివృద్ది చేసేందుకు ఆమోదం ఇచ్చారు” అని మంత్రి సవిత తెలిపారు.