Duvvada Srinivas : దువ్వాడ మిస్సింగ్ మిస్టరీకి తెర.. ఒడిశాలో లొకేషన్..? 3 వారాల గడువు కోరిన లాయర్!
Duvvada Srinivas Case : దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసులో సస్పెన్స్ వీడింది. ఆరోగ్యం బాగోలేదని, 3 వారాల సమయం కావాలని ఆయన లాయర్ పోలీసులను కోరారు. దువ్వాడ మొబైల్ సిగ్నల్ ఒడిశాలోని బరంపురం వైపు చూపిస్తున్నట్లు సమాచారం.
- Sreehari A
- Published on- June 30, 2026 / 07:38 PM IST
Duvvada Srinivas Case
Duvvada Srinivas Case : దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆయన కనిపించకపోవడంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దువ్వాడ కనిపించడం లేదంటూ గత రెండు రోజులుగా సాగిన సస్పెన్స్‌కు సంబంధించి తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దువ్వాడ ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోలుకోవడానికి 3 వారాల సమయం పడుతుందని ఆయన తరఫు న్యాయవాది (Duvvada Srinivas) పోలీసులను కోరారు. అదే సమయంలో దువ్వాడ మొబైల్ సిగ్నల్ ఒడిశాలోని బరంపురం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయన ఆచూకీపై ఒక స్పష్టత వచ్చింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో దువ్వాడపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు.
Read Also : Aquaculture Farmers : ఆక్వా రైతుల పోరాటం.. ఫీడ్ ధరల పెంపుపై ఉద్యమం.. చేపలు, రొయ్యల రేట్లు పెరగబోతున్నాయ్..!
అయితే, గంటలు గడిచినా ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. ఆయన అదృశ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దువ్వాడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దువ్వాడ సన్నిహితురాలు మాధురి స్పందిస్తూ.. ఉదయం ఇంటి నుంచి దువ్వాడ బయలుదేరిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలియలేదని, పోలీసులే దువ్వాడను అదుపులోకి తీసుకుని ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, కొత్తూరు పోలీసులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అసలు రాలేదని స్పష్టం చేశారు. ఆయనతో పాటు బయలుదేరిన పర్సనల్ పీఏ కూడా మార్గమధ్యంలో దిగిపోయినట్లు వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దువ్వాడ లాయర్ చేసిన ప్రకటనతో ఒడిశాలో మొబైల్ లొకేషన్ గుర్తించిన సమాచారం ఆధారంగా దువ్వాడ మిస్సింగ్ వ్యవహారంపై సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం పోలీసులు ఈ వివరాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
