మీ రుణం తీర్చుకుంటాం.. ఇక నా లక్ష్యం అదే: బాలకృష్ణ
Balakrishna: మాఫియాలు ఏపీని దోచుకున్నాయని విమర్శించారు.
- T Venkateshwarlu
- Published On : June 10, 2024 / 03:25 PM IST
TDP MLA balakrishna
టీడీపీ గెలుపుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ కుటుంబంపై హిందూపురం ప్రజలు చూపెడుతున్న అభిమానం వెలకట్టలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి మూడోసారి తనను ఎమ్మెల్యే చేసిన ప్రతి కార్యకర్తకు, అభిమానికి రుణపడి ఉంటానని తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. తన నియోజక వర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చిలమత్తూరు ఎత్తిపోతల పథకం నియోజకవర్గ వ్యాప్తంగా ఇతర కనీస మౌలిక వసతులు కల్పిస్తానని బాలకృష్ణ చెప్పారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని తెలిపారు.
భవిష్యత్ తరాలు బాగుండాలని ప్రతి ఒక్కరు ఆలోచించి కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించారని బాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయుడి సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు విజన్ ప్రపంచ దేశాలకే ఆదర్శమని చెప్పుకొచ్చారు.
బ్రహ్మాండంగా గెలిచేశామని సంబరాలు చేసుకోవడం కాదని, ముందున్న సవాళ్లను అధిగమించి అభివృద్ధి చేసి చూపుతామని బాలకృష్ణ తెలిపారు. వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. మాఫియాలు ఏపీని దోచుకున్నాయని విమర్శించారు.
Also Read: ఇదేంటిది? రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం వేళ.. అక్కడే కెమెరాకు చిక్కిన చిరుత?
