Mla Sundarapu Vijay Kumar: విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్రం 11వేల కోట్లు ఇచ్చిందంటే ఆ ఇద్దరే కారణం- ఎమ్మెల్యే విజయ్ కుమార్

కూటమి ధర్మం పాటిస్తూనే ఎవరి పార్టీ వారు అభివృద్ధి పరుచుకుంటున్నామన్నారు.

Mla Sundarapu Vijay Kumar: విశాఖ జనసేన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ జెండా ఎప్పుడూ నిలిచే ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారని విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం కూటమి పని చేస్తోందన్నారు.

గత వైసీపీ పాలనలో కనీసం జనవాణి కూడా నిర్వహించుకోకుండా ఇబ్బంది పెట్టారని ఆయన వాపోయారు. వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. పవన్ కల్యాన్ ను అణగదొక్కాలని ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పారు.

లేజిస్లేటివ్ పార్టీ సమావేశంలో 3 తీర్మానాలు చేసినట్లు వివరించారు. మహిళల మీద సోషల్ మీడియాలో వచ్చే అంశాల మీద తీర్మానం చేశామన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత మీద పని చేయాలని చర్చించామన్నారు.

1 నుంచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించామన్నారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల సెంటిమెంట్ గా కేంద్ర పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చించారని ఆయన తెలిపారు.

ప్రైవేటీకరణ మీద వైసీపీ నేతలు నోరు మెదపలేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కి కేంద్రం 11 వేల కోట్లు ఇచ్చిందంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లే కారణం అన్నారాయన. సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చేలా చేసింది తమ అధినేత చొరవే కారణం అన్నారు.

కూటమి ధర్మం పాటిస్తూనే ఎవరి పార్టీ వారు అభివృద్ధి పరుచుకుంటున్నామన్నారు. ఇకపై పవన్ కల్యాణ్ పర్యటనలో అవకాశం మేరకు కార్యకర్తల ఇంట్లోనే నిద్రించేలా ప్రణాళిక వేసుకోవాలని నిర్ణయించామన్నారు ఎమ్మెల్యే విజయ్ కుమార్.

Also Read: డబ్బులుంటే ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఘాటు వ్యాఖ్యలు..