డబ్బులుంటే ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఘాటు వ్యాఖ్యలు..
"అసలు భీమవరం కలెక్టరేట్‌కు, రఘురామకృష్ణ రాజుకు సంబంధం ఏమిటి? డబ్బులుంటే భీమవరం నుంచి మున్సిపాలిటీని, ఎమ్మార్వో ఆఫీస్‌ను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఉండి తరలించుకుని పోతారా?" అని అన్నారు.

Koyye Moshenu Raju
Koyye Moshenu Raju: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మోషేన్ రాజు మీడియాతో మాట్లాడారు.
“భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం లేదని రఘురామకృష్ణంరాజుకు ఎవరు చెప్పారో సమాధానం చెప్పాలి? రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజలను మోసం చేస్తున్నారు. (Koyye Moshenu Raju )
గత ప్రభుత్వంలో విడుదల చేసిన 124 జీవో ఇంకా అమలులోనే ఉంది. పెద అమిరం పంచాయతీని భీమవరంలో ఎందుకు కలుపుతారు? రఘురామ కృష్ణంరాజు తన వద్ద భూమి ఉందని చెబుతున్న మూడు ఎకరాల భూమి ఇరిగేషన్ పోరంబోకుది.
ఈ భూమిలో నిర్మాణాలు జరగాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలి. అసలు భీమవరం కలెక్టరేట్‌కు, రఘురామకృష్ణ రాజుకు సంబంధం ఏమిటి? డబ్బులుంటే భీమవరం నుంచి మున్సిపాలిటీని, ఎమ్మార్వో ఆఫీస్‌ను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఉండి తరలించుకుని పోతారా?
Also Read: అందుకే మేము దీని గురించి బీజేపీని అడుగుతున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఉండిలో కలెక్టరేట్ నిర్మాణానికి ముందుకు వస్తున్న దాతలు అందరూ కూడా భీమవరంలోనే నివాసం ఉంటున్నారు. రఘురామ కృష్ణంరాజుకు చిత్తశుద్ధి ఉంటే భీమవరంలో నిర్మించే కలెక్టరేట్ నిర్మాణానికి దాతలు సహకారం అందించండి.
భీమవరం నుంచి కలెక్టరేట్ తరలి వెళ్లదు. ఏఎంసీలో 20 ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయిస్తే ఎమ్మెల్యే రామాంజనేయులు ఇతర చోట్ల స్థలాలు చూడటం ఏమిటి? ఎమ్మెల్యే రామాంజనేయులు మెత్తమెత్తగా మాట్లాడితే కుదరదు.
జిల్లా స్థాయి అధికారులు భీమవరం ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా పెద అమిరంలో ఉన్న ఇరిగేషన్ భూమిని కలెక్టరేట్ గా మార్చాలని ప్రభుత్వానికి లేఖ ఎలా రాస్తారు? భీమవరం నడిబొడ్డులో ఎమ్మార్వో ఆఫీస్ స్థల విస్తీర్ణం ఆరెకరాలు ఉంది. ఈ భూమిలో కావాలంటే కలెక్టరేట్ నిర్మించుకోవచ్చు. ఎమ్మెల్సీల రాజీనామాలను ప్రొసీజర్ ప్రకారం మాత్రమే ఆమోదిస్తాం” అని అన్నారు.