mlc lella appi reddy press meet at media point slams minister atchannaidu
టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తప్పించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ఆరోపణలను తాము ఆధారాలతో సహా సభలో నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది, ప్రభుత్వం వివరణ ఇస్తుంది.. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ ప్రభుత్వమే ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
లడ్డూ అంశంపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం వస్తుందని ఆశించామని, కానీ చర్చకు మంత్రులు అడుగడుగునా అడ్డుపడ్డారని అప్పిరెడ్డి ఆరోపించారు. 2014 నుంచి 2026 వరకు నెయ్యి కొనుగోలుపై ఆధారాలను సభలో ఉంచితే నిజాలు బయటపడతాయని ప్రభుత్వం భయపడిందన్నారు. కేవలం హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడం కోసమే భక్తుల మనోభావాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం, వ్యాపారం కోసం దేవదేవుడిని అడ్డుపెట్టుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి మంత్రి అచ్చెన్నాయుడికి ఏం అర్హత ఉందని అప్పిరెడ్డి ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసమే మతాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. “కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించింది. అలా వెనక్కి పంపించిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడింది మీ ప్రభుత్వంలోనే కదా. కల్తీ జరిగిందని రిపోర్టు వచ్చింది మీ హయాంలోనే. ఈవో శ్యామలరావు నేతృత్వంలోనే నెయ్యి కల్తీ జరిగింది.. దీనికి మీరే సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
కనీసం టీటీడీ పాలకమండలినైనా గౌరవించాలని కోరారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని వెంటనే తప్పించాలని, కులమతాల ప్రస్తావన చేసే మంత్రి అచ్చెన్నాయుడిని అదుపులో పెట్టాలని అప్పిరెడ్డి సూచించారు. జగన్ క్రిస్టియన్ అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడాన్ని అప్పిరెడ్డి తప్పుబట్టారు. చైర్మన్‌ను క్రిస్టియన్ అన్నందుకు మంత్రి క్షమాపణ చెప్పారని, కానీ సోషల్ మీడియాలో టీడీపీ వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైర్ (స్థానాన్ని) అవమానపరిచేలా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
దీనిపై మండలి చైర్మన్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని వివాదం చేయవద్దని కోరారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేస్తే, దానిని ప్రభుత్వానికి పంపుతానని చైర్మన్ స్పష్టం చేశారు.