ఏపీకి కొత్త గవర్నర్ : ఐరన్ లేడీ కిరణ్ బేడీ 

అమరావతి : ఏపీకి కొత్త గవర్నర్గా ఐరన్ లేడీ కిరణ్ బేడీ రాబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏపీకి కిరణ్ బేడీని నియమించటంలో రాజకీయ కోణం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్ బేడీ గవర్నర్‌గా రానున్నారనే వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  రాష్ట్ర విభజన అనంతరం పరిపాలనాపరంగా అన్ని శాఖలనూ రెండు రాష్ట్రాలకూ విభజించారు. కానీ గవర్నర్‌ను మాత్రం ఉమ్మడిగానే ఉంచారు. రెండు రాష్ట్రాలకూ నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరించినా… ఆయన తమకు అనుకూలంగా లేరని టీడీపీ ప్రభుత్వం చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం… పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌బేడీని ఏపీ గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం రాజకీయంలో  భాగమనే అంశం తెరపైకి  వచ్చింది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో… గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టిసారించింది. ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కేంద్రాన్ని, మోడీని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేదీ నియామకం జరగ్గా… ఇప్పుడు గవర్నర్ నియామకంపై కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికీ కిరణ్ బేడీకి మధ్య సఖ్యత లేదు. గవర్నర్‌గా ఆమెను తొలగించాలని సీఎం నారాయణస్వామి చాలాసార్లు డిమాండ్ చేశారు. కిరణ్ బేడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తున్నారని.. ప్రభుత్వ పథకాలు అమలవ్వకుండా అడ్డుకుంటున్నారని పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అలాంటి వ్యక్తిని ఏపీకి తీసుకురావడం అంటే రాజకీయంలో భాగమే అనే విశ్లేషణ వినిపిస్తోంది.

 

మాజీ ఐపీఎస్ ఆఫీసర్‌గా, సామాజిక వేత్తగా కిరణ్ బేడీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ బీజేపీలో చేరాక కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏపీ గవర్నర్‌గా నియమిస్తే, అది చంద్రబాబుకి ఎదురుదెబ్బే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.