ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి(లెజిస్లేచర్), విశాఖ(ఎగ్జిక్యూటివ్), కర్నూలులో(జ్యుడీషియల్) కేపిటల్స్
ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి(లెజిస్లేచర్), విశాఖ(ఎగ్జిక్యూటివ్), కర్నూలులో(జ్యుడీషియల్) కేపిటల్స్ ఉండొచ్చు అని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజధాని ప్రాంత రైతులు నిరసనలు, ఆందోళనలకు దిగారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఇంతకీ మంత్రి ఏమన్నారంటే.. మూడు చోట్ల రాజధాని ఉండొచ్చు అని మాత్రమే సీఎం జగన్ చెప్పారు. రాజధానులు అక్కడ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. అని మంత్రి అన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.
సచివాలయం ఒక చోట.. అసెంబ్లీ మరో చోట ఉంటే తప్పేంటి..?
సెక్రటేరియేట్ ఎక్కడ ఉండాలనేది రిపోర్టులో ఉంటుందని మంత్రి వివరించారు. అయినా సెక్రటేరియట్ ఎక్కడ ఉంటే ఏంటి? అని మంత్రి ప్రశ్నించారు. ఒక చోట సెక్రటేరియట్.. మరో చోట అసెంబ్లీ ఉంటే తప్పేంటీ..? అని ప్రశ్నించారు. అంతా నాకే ఉండాలి.. అంతా నా జిల్లాలోనే ఉండాలనే భావన కరెక్ట్ కాదన్నారు. కమిటీ ఇచ్చే నివేదికలో అలా ఉండొచ్చు.. కావచ్చు అనే సీఎం అన్నారని మంత్రి స్పష్టం చేశారు. కానీ.. నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం చెప్పలేదని గుర్తు చేశారు.
ఏదైనా నిర్ణయం తీసుకుంటే దమ్మున్న నేతగా చెప్పి చేసే సత్తా ఉన్న నాయకుడు జగన్ అని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రజాస్వామ్యవాదిగా అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. నివేదికలో ఇలా ఉండొచ్చనే రీతిలో సీఎం జగన్ చెప్పారు తప్పితే.. మూడు రాజధానులు చేసేస్తామని సీఎం చెప్పలేదన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రిపోర్ట్ ఉంటుందని చెప్పారని తెలిపారు.
నిర్ణయం తీసుకోకముందే ఎందుకింత రచ్చ:
టీడీపీ నేతలపై మంత్రి ఫైర్ అయ్యారు. రాజధాని గురించి టీడీపీ నేతలు తలో మాట అంటున్నారని విమర్శించారు. రాజధాని విశాఖలో ఉంటే బాగుంటుందని ఒకరు.. కర్నూలులో ఉంటే బాగుంటుందని మరొకరు… అమరావతిలోనే ఉంటే ఇంకా బెటర్ అని యనమల, నారాయణ వంటి వారు అంటున్నారని మంత్రి చెప్పారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే తుది నిర్ణయం ఉంటుందని మంత్రి పేర్నినాని తేల్చి చెప్పారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు భూములు కొన్నారని.. అందుకే తాము రాజధాని మారుస్తున్నామనే ఆరోపణలను మంత్రి ఖండించారు. 3 రాజధానులపై సీఎం జగన్ తన అభిప్రాయం మాత్రమే చెప్పారు.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అలాంటప్పుడు ఎందుకింత రచ్చ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.