CM Jagan Aerial Survey : నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగనమోహన్‌రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలతో పాటు పంట నష్టాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రేణిగుంట విమానాశ్రయంలో సమీక్షిస్తారు. ఏరియల్ సర్వే కోసం ఆయన ఇవాళ ఉదయం 8.30కు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 9.45కు రేణికుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు.
రైతులకు తీరని నష్టం :
మరోవైపు నివార్ తుపాన్ రైతులను నిండా ముంచింది. చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నివార్ తుపాను ప్రధానంగా 10 జిల్లాలపై ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లోని 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా భావిస్తోంది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశముంది. నివార్ తుపాను కారణంగా కురిస్తున్న వర్షాలతో వరిపైరు నీట మునిగింది. పలుచోట్ల వరిపంట నేల కరవడంతో రైతులకు పెద్ద ఎత్తు నష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలతో 20 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు కోలుకోలేని దెబ్బ తిన్నారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టు ఇప్పుడు నివార్ తుపాను కూడా అన్నదాత ఆశలన్ని తుంచేసింది. చేతికొచ్చిన పంటలను ఊడ్చిపెట్టుకు పోయింది.
https://10tv.in/ap-cm-jagan-responded-on-raising-the-height-of-polavaram-project/
పోలాల్లో నీరు :
గుంటూరు జిల్లాలో వ్యవసాయ పంటనష్టం అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాలు పంటలు దెబ్బతిన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో 90వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 10వేల ఎకరాల్లో వరినాళ్లు నీట మునిగాయి. వరితో పాటు సెనగ, పొగాకు రైతులకూ తీవ్ర నష్టాన్ని నివార్ మిగిల్చింది. రాయలసీమతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతులు సెనగను సాగు చేస్తున్నారు. ఇప్పటికే 5 లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. కొన్నిచోట్ల పొలాలు సిద్ధం చేసి ఉంచారు. పొలాల్లో నీరు నిలవడంతో.. మొలకెత్తిన సెనగకు నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు, కృష్ణాలో :
చిత్తూరు జిల్లాలో వేరుసెనగ, ఉలవపైర్లు నీటిలో మునిగాయి. ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పొగనారు, మినుములు నీట మునిగాయి. భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తోటలకూ తీరని నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పసుపు, ఉల్లిపంటతోపాటు.. పూలతోటలు నీటమునిగాయి నివార్ తుపానుతో కృష్ణా జిల్లా రైతులు వణికిపోయారు. కృష్ణా పశ్చిమడెల్టాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా లక్ష హెక్టార్లలో వరి పంట నేలవాలి దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. పత్తి పంటకూ తీవ్ర నష్టం కలిగింది. అటు విశాఖ జిల్లాలో 10వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది.