NTR Health university Name Changed : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం .. తీవ్రంగా మండిపడుతున్న టీడీపీ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. పేరు మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా మండిపడుతున్నారు.
- nagamani
- Published on- September 21, 2022 / 10:39 AM IST
NTR health university name will be changed as ysr health university
NTR Health university Name Changed In AP : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ,వైసీపీ మధ్య రగడ రాజుకుంది. 1986లో పురుడుపోసుకున్న యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఉన్న ఎన్టీఆర్ పేరును తీసివేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టటానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.దీనికి సంబంధించి బిల్లును కడా సిద్దం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. భారతదేశంలో మొదటిసారి సంక్షేమ రాజకీయాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ పేరు మార్చటం అంత్యంత దారుణమని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అటువంటి వ్యక్తి పేరును మార్చటం దారుణమని ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే వైసీపీ ప్రభుత్వం చరిత్రహీనులుగా మిగిలిపోతుందంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ నేడు సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది జగన్ ప్రభుత్వం. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లుగా నేడు అసెంబ్లీ ముందుకు రాబోతున్న దీనిని వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రవేశపెట్టనున్నారు. దీంతో టీడీపీ ఆందోళన చేపట్టింది. సభలో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు టీడీపీ నేతలు.
నిజానికి ఏపీలో వైద్య విద్యార్థులకు అప్పట్లో ప్రత్యేకంగా యూనివర్సిటీ అంటూ ఉండేది కాదు. ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలే వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసేవి. దీంతో ఎంబీబీఎస్ నకిలీ సర్టిఫికెట్లు కూడా పుట్టుకొచ్చిన ఘటనలు జరిగాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్వయంప్రతిపత్తి కలిగిన ఓ వర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించారు.
అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా విజయవాడలో హెల్త్ యూనివర్శిటీ నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1986లో నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లో దీనికి ‘యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1998లో దీనికి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరు మార్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ దాని పేరును మరోమారు మార్చుతూ ‘డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’గా మార్చారు. ఇప్పుడీ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతటి ఔదార్యంగా పాలన సాగించారో దానికి వ్యతిరేకంగా నేటి జగన్ ప్రభుత్వం మాత్రం నిరకుశపాలన చేస్తోందనే విమర్శలు వెల్లుతున్నాయి. ఇన్ని వివర్శలు వస్తున్నా..వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ వైఖరిని సమర్ధించుకుంటోంది.
