YS Jagan : కేంద్ర బలగాలతో.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలి : వైఎస్ జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, రాజ్యాంగ వ్యవస్థలను తీవ్రంగా దిగజారుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
YS Jagan
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, రాజ్యాంగ వ్యవస్థలను తీవ్రంగా దిగజారుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులకు తెగబడటంపై తాము సేకరించిన పక్కా ఆధారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), గవర్నర్, సుప్రీం కోర్టుకు అందజేసినట్లు తెలిపారు.
తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎస్ఈసీకి, ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో మొట్టికాయలు వేసిందని జగన్ అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, భద్రత కల్పించి అభ్యర్థులందరిచేత నామినేషన్లు వేయించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, సుప్రీంకోర్టు అంత స్పష్టంగా హెచ్చరించినప్పటికీ సీఎం చంద్రబాబు వైఖరిలో గానీ, ఎస్ఈసీ, పోలీసుల ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదని జగన్ మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థలో చంద్రబాబు ‘శకుని పాత్ర’ పోషిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును అడ్డగోలుగా బుల్డోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ కేంద్రాల వద్దే రిగ్గింగ్ చేస్తూ బీహార్‌ను మించిన రక్తచరిత్రను రచిస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకమే ఉంటే చేసిన మంచిని చూపి ఓట్లు అడగాలి. కానీ, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోకుండా నిష్పక్షపాత ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయని జగన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా నామినేషన్లు వేయలేకపోయిన 19 మున్సిపాలిటీల్లో కేవలం 4 చోట్లే నామినేషన్లు తీసుకోవడం ఎస్ఈసీ పక్షపాత వైఖరికి నిదర్శనమని జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎస్ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తుందా.. ?చంద్రబాబు ఆదేశాలు పాటిస్తుందా అంటూ జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా లేరు.. అడ్డుగోలుగా గెలవాలని చూస్తున్నారు. మా హయాంలో చేసిన మంచి చూపించి.. 86శాతం విజయం సాధించాం. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా జ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లలో మరింత బరిగెతించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు అష్ట కుట్రల వ్యూహం అమలు చేస్తున్నారు. అక్రమాలు చేస్తున్న పోలీసులను, అధికారులను తప్పించకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయని జగన్ ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల రిగ్గింగ్ నుండి నామినేషన్ కేంద్రాల రిగ్గింగ్ కి చంద్రబాబు దిగజారిపోయాడు.. స్వేచ్ఛగా నామినేషన్ వేయనిస్తే అందరూ ప్రజల ముందుకు వెళ్లి ఆశీర్వాదం అడుగుతాం కదా..?
నామినేషన్ వెయ్యనియ్యాకపోవడం అంటే ప్రజల తీర్పుని బుల్డోజ్ చెయ్యడమే కదా..? అంటూ జగన్ ప్రశ్నించారు.
