Bhogapuram International Airport : భోగాపురం విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. వేదికపై ఆసక్తికర సన్నివేశం..

PM Modi inaugurates Bhogapuram Airport terminal building : ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు.

PM Modi inaugurates Bhogapuram Airport terminal building : ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ప్రధాని వెంట గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. టెర్మినల్ భవనంలో ఆధునిక సదుపాయాలను మోదీ పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు వివరించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను మోదీ పరిశీలించారు.

థింసా నృత్యంతో ఘన స్వాగతం..
భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ లు ప్రత్యేక ఓపెన్ టాప్ వాహనంపై సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి నిదర్శనమైన గిరిజన సాంప్రదాయ నృత్యం థింసా నృత్యంతో వారికి ఘన స్వాగతం లభించింది.

వేదికపై ఆసక్తికర సన్నివేశం..
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలోభాగంగా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీకి కంటే ముందు స్టేజీపైకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు వచ్చి.. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆశీనులయ్యారు. అయితే, సీఎం చంద్రబాబు పక్కన అశోక్ గజపతిరాజు.. ఆయన పక్కన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ .. ఆ తరువాత పవన్ కల్యాణ్ కూర్చున్నారు. దీనిని గమనించిన చంద్రబాబు బాబు నాయుడు పవన్ కల్యాణ్ పిలిపించుకొని తన పక్కన చైర్‌లో కూర్చోబెట్టకున్నారు. దీంతో సభా ప్రాంగణం చంద్రబాబు, పవన్ కల్యాణ్ నామస్మరణతో మారుమోగిపోయింది. ఇదే సమయంలో వేదికపైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు, పవన్ స్వాగతం పలికారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు పొందూరు ఖాదీ శాలువాతో ప్రధాని మోదీని సత్కరించారు. బొబ్బిలి వీణను కానుకగా అందజేశారు.

మంత్రి నారాలోకేశ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర కలలకు ప్రధాని నరేంద్ర మోదీ రెక్కలు ఇచ్చారు.. ఎర్ర బస్సు రాదన్న చోట.. ఎయిర్ పోర్టు వచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి నడిచిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని లోకేశ్ అన్నారు. విభజన వల్ల చాలా నష్టపోయామని.. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడారని పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎయిర్ పోర్టు కీలకం కాబోతోందని పేర్కొన్నారు. నమో అంటే ఒక నమ్మకం.. సురక్షిత భారతం. నమో కా మతలబ్.. హిమ్మత్.. దుశ్మన్ కో ఢర్ అంటూ లోకేశ్ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శరవేగంగా విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థకు నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.