Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ ..
Rain Alert : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
- Harish Thanniru
- Updated on- June 16, 2026 / 06:28 PM IST
Andhra pradesh weather update
- ఏపీకి రెయిన్ అలర్ట్
- రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం
- పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు
Rain Alert : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రేపు (బుధవారం) పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తూర్పు విదర్భ – తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని, ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
ఇక మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పిడుగులు, ఉరుములు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుకాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. గుండె జబ్బులు, మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) సమస్యలతో బాధపడుతున్న వారు అవసరం లేకుండా ఎండలో తిరగవద్దని అధికారులు సూచించారు. వేడి ప్రభావం ఎక్కువగా ఉండే సమయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
