రామతీర్థం నుంచి తిరుపతి వరకు రథయాత్ర, బీజేపీ నిర్ణయం

AP BJP Rath Yatra : ఆలయాలపై దాడి ఘటనలు ఏపీ రాజకీయాల్లో హీట్ రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. చలో రామతీర్థం కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం.. ఆ సమయంలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం మరింత కాక పుట్టించింది. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తే.. వరుస ఘటనలు జరుగుతున్నా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని… హిందూమతంపైనే ప్రభుత్వం దాడి చేస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది.

రామతీర్థం ఘటన తర్వాత జరిగిన పరిణామాలను కమలం పార్టీ నేతలు.. కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు జగన్ మీద ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే హిందూ మతంపై దాడి జరుగుతోందని.. దీన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం, పోలీసులు.. తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణకు రధయాత్ర చేపట్టాలని బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. ఆదివారం విశాఖలో సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన కార్యచరణ ప్రకటించాలని భావిస్తున్నారు.

రామతీర్ధం నుంచి తిరుపతి వరకు రధయాత్ర చేపట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎక్కడైతే ఆలయాలను ధ్వంసం చేశారో.. వాటిని పరిశీలించి.. అక్కడి పరిస్థితులను ఈ రధయాత్ర ద్వారానే జనాలకు వివరించేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఆదివారం విశాఖ బిజెపి కోర్ కమిటీ సమావేశంలో రధయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రథయాత్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని, జగన్ పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ.. ప్రజల్లోకి వెళ్లాలని కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈ కార్యక్రమం మొదలయ్యాక రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుంది. ఎలాంటి సెగలు కనిపించబోతున్నాయన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.