RAW NTR : ఎన్టీఆర్ నాటిన ఒక విత్తనమే మేము.. ఆయన స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తాం
RAW NTR Founder Sai Roop : ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చేయబోమని రా ఎన్టీఆర్ సంస్థ ఫౌండర్ సాయి రూప్ స్పష్టం చేశారు. ఆయన స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తామని స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Updated on- July 18, 2026 / 11:54 AM IST
RAW NTR Founder Sai Roop
RAW NTR Founder Sai Roop : కొద్దిరోజులుగా రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో శనివారం ఉదయం తిరుపతిలో సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్, సంస్థ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రూప్ మాట్లాడుతూ తమ సంస్థ చేపట్టనున్న ‘ఊరు – వాడ’ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా సంస్థపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మేము చేపట్టనున్న సేవా యజ్ఞంలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయని సాయి రూప్ తెలిపారు. మొదటిది సేవతో యువ జాగృతి, రెండోది మన ఊరు మన బాధ్యత, మూడోది ఊరిమాట పాలకులు దాక.
సేవతో యువ జాగృతి.. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఉపయోగపడేలా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు.
మన ఊరు మన బాధ్యత.. గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, స్థానిక ప్రజల సహకారంతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా రైతు సదస్సులు నిర్వహించి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఊరి మాట పాలకుల దాకా.. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం పనిచేస్తుందని సాయి రూప్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఊరి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చేయబోమని సాయి రూప్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అభిమానులు చేసిన సేవలు ఎవరూ చేయలేదని, సేవ అంటే అన్నదానం, రక్తదానం మాత్రమే కాదని.. ఏదైనా చేయవచ్చునని చెప్పారు. ఎన్టీఆర్ నాటిన ఒక విత్తనమే మేమన్న సాయి రూప్.. ఇప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, వంద కోట్ల మోసగాడు అంటూ, అభిమానులు ముసుగులో దందా చేస్తున్నారు అంటూ అసత్య ప్రచారం చేశారని అన్నారు.
ఎన్టీఆర్ కు సంబంధం లేకుండా మాకు వ్యతిరేకంగా లేఖ విడుదల అయినట్లు అనుమానిస్తున్నామని సాయి రూప్ అన్నారు. మాకు వ్యతిరేకంగా లేఖ ఎలా వచ్చింది అనేది మాకుకూడా అర్ధం కాలేదని.. ఎన్టీఆర్ స్వయంగా చెబితే.. ఈ పనులు ఆపేస్తామని సాయి రూప్ స్పష్టం చేశారు.
